భారీ మూల్యం (కథ) --సరికొండ శ్రీనివాసరాజు

 శ్రీలేఖ చాలా తెలివైన అమ్మాయి. చిన్నప్పటి నుంచి తరగతిలో ఆమెకు పోటీ వచ్చేవారే లేరు. శ్రీలేఖ 9వ తరగతికి వచ్చేసరికి వాళ్ళ నాన్నకు వేరే ఊరికి బదిలీ అయింది. శ్రీలేఖ కూడా పాఠశాల మారవలసి వచ్చింది. ఆ పాఠశాలలోనూ ఆమెకు తిరుగే లేదు. 9వ తరగతి పూర్తి అయ్యేవరకు శ్రీలేఖదే మొదటి ర్యాంకు. ఇప్పుడు శ్రీలేఖ 10వ తరగతిలోకి వచ్చింది. ఇటీవల శ్రీలేఖతో అనూష అనే అమ్మాయి స్నేహం చేసింది. రోజూ తన వెంట తెచ్చుకున్న చిరుతిళ్ళను శ్రీలేఖకు ఇచ్చేది. శ్రీలేఖకు కమ్మని కబుర్లు చెప్పేది. ముఖ్యంగా తాను క్రమం తప్పకుండా చూసే సినిమా కథలు, ముచ్చట్లు చెప్పేది. ఇతరుల గురించి కామెంట్స్ చేసేది. ఈ ముచ్చట్లకు లొంగిపోయింది శ్రీలేఖ. పాఠశాలలోనూ ఉపాధ్యాయులు పాఠం చెబుతుంటే శ్రీలేఖ, అనూష ఒకటే ముచ్చట్లు. లెక్కల మాస్టారు అటు తిరిగి, బోర్డు మీద లెక్కలు చెబుతుంటే వీరిద్దరూ ఒకటే గుసగుసలు. ఏ ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నా ఉపాధ్యాయులకు తెలియకుండా ఒకరిని చూసి మరొక ముసి ముసి నవ్వులు. 

       ఒకరోజు తెలుగు ఉపాధ్యాయులు వీరిద్దరినీ ప్రత్యేకంగా పిలిచి ఇలా అన్నాడు. "చూడమ్మా శ్రీలేఖ. స్నేహం మంచిదే. ఆ స్నేహం చదువులో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేలా ఉంటే మరీ మంచిది. ఏకాగ్రతతో పాఠాలు వింటేనే అవి మెదడులో బలంగా నాటుకుపోతాయి. కానీ పాఠాలు వినకుండా బట్టీ పట్టి చదివితే లాభం లేదు. కాబట్టి మీ ముచ్చట్లు మానేసి చదువుపై ధ్యాస ఉంచండి." అని హితబోధ చేశారు. "అలాగే గురువు గారూ! అంటూ ఇద్దరూ వినయంగా తల ఊపారు. అవతలికి వెళ్ళాక పగలబడి నవ్వారు. పైగా ఉపాధ్యాయులపై కామెంట్స్ మొదలు పెట్టారు శ్రీలేఖ, అనూషలు. ఇది తెలిసిన ఉపాధ్యాయులు వీరిద్దరినీ మందలించారు. వీరిద్దరి ప్రవర్తన గురించి వీరి తల్లిదండ్రులకు తెలియజేశారు. అయినా మార్పు రాకపోవడంతో వీరిద్దరినీ పట్టించుకోవడం మానేశారు. 
       క్రమంగా శ్రీలేఖకు మార్కులు తక్కువగా వస్తున్నాయి. ప్రీ ఫైనల్లో శ్రీలేఖ మార్కులు మరీ తగ్గిపోయాయి. అనూషకు అయితే ఫెయిల్ మార్కులు వచ్చాయి. శ్రీలేఖ ర్యాంకు 15కు పడిపోయింది. తల్లిదండ్రులు శ్రీలేఖను విపరీతంగా తిట్టారు. క్లాస్ మేట్సు అయితే తలచుకొని మరీ పగలబడి నవ్వారు. పెద్దల మాట వినకపోవడం మరియు చెడు స్నేహం వల్ల తాను విలువైన సమయాన్ని కోల్పోయానని పశ్చాత్తాపంతో కుమిలి పోయింది. ఇప్పుడు విచారిస్తే గడిచిపోయిన సమయం తిరిగి రాదు కదా!