శ్రీదేవిఇంటశ్రీరామనవమివేడుక:- శ్రీదేవి రమేష్ లేళ్ళపల్లి


 మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

జై సీతారాం
యత్ర యత్ర రఘునాధ కీర్తనం,
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం,
మారుతిం నమత రాక్షసాంతకం
(ఎందెందున శ్రీరామ కీర్తన జరుగునో, అచ్చట హనుమంతుడు తల వంచి అంజలి ఘటించి ఆనంద బాష్పములు రాల్చుచుండును.
రామభక్తులకు హనుమంతుడు రక్షకుడు.)
నాకు నా చిన్నప్పటి నుండి సీతారాములు,ఆంజనేయ స్వామి అంటే అపారమైన భక్తి🙏
ఎం.ఎస్.రామారావు గారి సుందరకాండ పారాయణం చేసినప్పుడు నాకు కలిగిన దైవికమైన  అనుభవం  మీ అందరితో పంచుకుంటాను
మా మేనత్తగారు శ్రీమతి విట్ఠల రమాదేవి గారు,శ్రీ శ్రీనివాస్ రావు గారు  రెండు,మూడు సంవత్సరాలు శ్రీరామ నవరాత్రులలో (ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు)గురువు గారు ఎం.ఎస్.రామారావు గారిని ఆహ్వానించి వారిచే సుందరాకాండ పారాయణం చేయించారు  వరంగల్ లో వారి 2 ఎకరాల  పెద్ద ఇంట్లో.
మా నాన్న గారు శ్రీ సదాశివరావు గారు ఈ సుందరాకాండ పారాయణ కార్యక్రమానికి  అన్నీ  దగ్గరుండి పర్యవేక్షించేవారు. 
మా కుటుంబం దాదాపు 15 రోజులు అక్కడే ఉన్నాము.
అనుకున్నట్టుగా గురువు గారు ఒక్కరోజు ముందు వచ్చారు. ఉగాది నుండి రోజు ఉదయం సాయంత్రం సుందరకాండ పారాయణం చేసి మంగళ హారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు  ఇచ్చేవారు.
ఇక అందరూ ఎదురు చూస్తున్న  శ్రీరామ నవమి  పర్వదిన తరుణం రానే వచ్చింది.
తెల్లవారు ఝామున శ్రీరామ నవమి ఉత్సవం మొదలు పెట్టారు. 
మా ఇంటి పురోహితులు వచ్చి సీతారామ కల్యాణం చేయించారు.
సాయంత్రం ఎం.ఎస్.రామారావు గారు ఎప్పటిలాగే  వారి దైవికమైన కంఠంతో సుందరాకాండ పారాయణ చేయడం మొదలు పెట్టారు.
మా బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు అందరూ వచ్చారు.
మా కుటుంబం మాత్రం స్టేజ్ మీద కూర్చునేవాళ్ళం. గురువు గారికి ఏదైనా సహాయం అవసరమని. అమ్మ నాన్న అన్నయ్య,నేను మా అత్తయ్య గారి కుటుంబం తో పాటు. 
స్టేజ్  మధ్యలో అలంకరించిన సీతారాముల విగ్రహాలు. పక్కనే హనుమంతుల వారి విగ్రహం. చూడటానికి రెండు  కళ్ళు సరిపోనంత  సుందరదృశ్యం అది
స్టేజ్ కి ఒక పక్కన  కూర్చుని గురువు గారు సుందరాకాండ పారాయణం
చేసేవారు.  మైక్ వల్ల ఆ ప్రాంతం అంతా సుందరాకాండ మారుమ్రోగింది. 
ఆ ప్రాంతం అంతా రామ మాయం అయింది.
చివరి రోజు కావడంతో జనాలు ఎక్కువగా వచ్చారు.
అందరూ గురువు గారు చెపుతున్న సుందరాకాండ ని  శ్రద్ధగా వింటున్నారు.
భక్తి పారవశ్యం తో ఆ స్థలి మారుమోగింది
పారాయణం పూర్తి అయింది. ఎం.ఎస్.రామారావు గారు మంగళం పాడుడుతున్నారు భక్తితో జనం పులకరించి పోయారు.
అప్పుడు ఒక దైవికమైన ఘటన జరిగింది క్షణ కాలంలో.
గురువు గారు మంగళం పడుతూ ఉండగా హఠాత్తుగా ఒక చిన్న బాలుడు బాలాంజనేయుడిలా స్టేజ్ మీద కనిపించి  "రామ రామ రామ రామ" అంటూ భజన చేస్తూ పరిసరాల్ని మైమరచి పోయాడు. 
గురువుగారు మా నాన గారు,అత్తయ్య,అమ్మ, నేను చూసాము .నేను నాన్న ఆంజనేయుడు అంటున్నాను. గురువు గారు,నాన్న భావోద్వేగానికి గురయ్యి ఏడుస్తూ వున్నారు. క్షణం లో మాయమయ్యారు ఆ బాలుడు.
స్టేజ్ కింద ఒకటే కోలాహలం కొందరు ఆ బాలున్ని చూసిన వారు ఎవరి అబ్బాయి అని ఆరా తీస్తున్నారు. కానీ ఆ బాల హనుమంతుడిలా వచ్చిన వారు ఎవరి అబ్బాయి కాదని తేలింది. .
అప్పుడు చూసిన వారికి అర్ధం అయింది ఆ బాలుడు ఎవరో కాదని సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారేనని
అప్పుడు గురువు గారు మైక్ లో చెప్పారు. వారు సుందరాకాండ పారాయణం చేసినప్పుడు కొన్ని సార్లు ఇలా హనుమ వచ్చారని.
 భక్తి ,శ్రద్ధలతో సీతారాములను ప్రార్థిస్తే ఆంజనేయ స్వామి వారు తప్పక వస్తారని అందరికి తెలియ చేశారు
ఆ దైవికమైన ఘటనను తలుచుకుంటూ అందరూ సీతారామ కల్యాణ పెళ్ళి భోజనం చేసి ప్రసాదాలు తీసుకుని వెళ్ళారు
అప్పుడు నా వయసు సుమారు 6,7 ఏళ్ళు ఉంటాయి. ఆ బాలాంజనేయులు నా హృదయంలో స్థిరంగా నిలిచిపోయారు. ఏ పూర్వ జన్మ చేసిన ఫలమో నేను ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నాను
మిత్రులందరికీ  మరొక్కసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలతో నమస్సులు
ఈరోజు సుందరాకాండ ఎం.ఎస్.రామారావు గారిది mp3 విన్నాను హెడ్ ఫోన్స్ పెట్టుకుని. 
అంజనేయుడి తో పాటు నేను కూడా లంకకు వెళ్లి సీతమ్మను చూసిన భావన కలిగింది.
సీతమ్మ ,శ్రీరాముల వారు మనకెప్పుడు ఆదర్శ ప్రాయులే
ఆంజనేయుల వారు అశోక వనం వెళ్ళి సీతమ్మని చూసిన ఘట్టం  నాకు నయనానందకరంగా అనిపించింది
సీతమ్మ  ఆత్మ విశ్వాసంతో రావణుడికి చెపుతుంది. నువ్వు తృణము (గడ్డి)కన్నా హీనం అని,
నా భర్త అనుమతి లేదు కనుక నిన్ను వదిలి పెడుతున్నాను
లేకుంటే భస్మం చేయగలను అని.
ప్రతి పాదం చివర, సీతమ్మ వారి మనసు
 " సంపూర్ణంమైన విశ్వాసం తో" అని ఉంటుంది.
ఇప్పుడు మన దేశ,ప్రపంచ ప్రజలకు కూడా వుండవల్సింది మనపై మనకు  సంపూర్ణమైన విశ్వాసం, కరోనా నుండి ఆత్మ స్థైర్యం తో బయటపడి  సంతోషంగా ఉండాలని
Note:-  మీరు వినలేదని కాదు కాని ఒక్కసారి  సుందరాకాండ mp3 లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కాల్కుమూసుకుని విజువలైజ్ చేసుకుంటూ వినండి
లింక్ పెడుతున్నాను కింద క్లిక్ చేసి వినండి
https://youtu.be/6NjPe9xwJpI
ఆ సీతారాముల కరుణాకటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ
సర్వేజనాః సుఖినోభవంతు
ఈ రోజు మా ఇంటి వంట:-
సేమియా పాయసం,
ఆవపిండిపులిహోరా,
వడపప్పు,పానకం,క్యారెట్ కూర, గోంగూరపులుసు, ముద్ద పప్పు(ఫోటో తీయడం మర్చిపోయాను),
దోసావకాయ,గోంగూర పచ్చడి,ఊరమిరపకాయలు
సర్వేజనాః సుఖినోభవంతు