*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౦౨ - 02)

 శార్దూలము :
*వాణీవల్లభ దుర్లభంబగు భవ | ద్వారంబునన్నిల్చి, ని*
*ర్వాణశ్రీ చెరపట్టచూచిన విచా | రద్రోహమో, నిత్య క*
*ళ్యాణ క్రీడలబాసి, దుర్దశలపా |లై, రాజలోకాధమ*
*శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో | శ్రీకాళహస్తీశ్వరా* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
అన్ని జీవులకూ మోక్షాన్ని ప్రసాదించే నీ గుమ్మం దగ్గరకు రావడం, ఈ సృష్టి కార్యక్రమం చేసే సరస్వతీ దేవి భర్త అయిన బ్రహ్మ కు కూడా సాధ్యం కాదు.  అటువంటి పవిత్రమైన నీ గుమ్మం దగ్గర నిలిచి నీ దగ్గరకు చేరి మోక్షమార్గం చేరాలి అనే నా కోరిక నీకు అతిగా అనిపించిందో ఏమో,  ప్రతీ రోజూ వివిధరకాల అసత్యమైన సంతోషాల వెంట పరుగెత్తి, చేరరాని రాజుల దగ్గర చేరి అనిత్యము, అసత్యము అయిన విషయాల వెంట తిరిగేలా చేసావా, అరుణాచలా!.... అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పరమాత్మా, నిన్ను తెలుసుకోవాలి అంటే నీ అనుమతి వుంటేనే కదా సాధ్యమవుతుంది.  మేమేమో, నీ మాయా మోహంలో పడి కొట్టుకు పోతున్నాము.  మాలోనే వున్న నిన్ను మరచిపోయాము.  నీ మాయచే సృష్టించబడిన బాహ్య ప్రపంచలో నిన్ను వెతికే ప్రయత్నం చేస్తున్నాము. నిన్ను నమ్ముకుని, నీతోనే వుంటే నీవు దాటించలేని సముద్రం వుందా, లేదు కదా, ...... మార్కండేయ రక్షకా!*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss