శ్రీకాళహస్తీశ్వర శతకము - పద్యం (౦౬ - 06)
 శార్దూలము :
*స్వామిద్రోహముచేసి, వేరొకని కొ | ల్వన్ బోతినో, కాక నే*
*నీమాటల్విన నొల్లకుండితినో? ని | న్నే దిక్కుగా జూడనో?*
*యేమీ ఇట్టి వృధాపరాధినగు న | న్నీ దుఃఖవారాశి వీ*
*చీమధ్యంబున ముంచియుంపదగునా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నీకు అన్యాయం చేసి, ఇంకొకరిని సేవించడానికి వెళ్ళానా, లేక పోతే నీ మాటలు లెక్కపెట్టకుండా వున్ననా, కాకపొతే ! నీవే నాకు దిక్కు అనే విషయం మరచిపోయి నిన్ను నేను గౌరవించడం లేదా.  నీయందు ఇటువంటి పొరపాట్లు ఏవీ చేయని నన్ను,  ఈ పాపాలు అనే సముద్రపు అలలలో కొట్టుకుపోతున్నా కూడా, అలాగే వదిలి వేస్తున్నావు ఎందువల్ల, మదనాతకా....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మార్కండేయ బాలుడు ఏవిధంగా అయితే నీవే దిక్కని నమ్మి నిన్ను కొలిచాడో,అలాగే నేను కూడా నిన్నే నమ్మి వున్నాను, చంద్రచూడా. నీ కడకంటి చూపే, ఆజ్ఞగా స్వీకరించి నీ మాటనే పట్టుకుని వుంటున్నాను, పన్నగ భూషణా.  అంతగా నీవే దిక్కని నమ్మిన మమ్మల్ని, ఈ భవసాగర దుఃఖాలలో వదిలేసి ఊరకుండుట, నీకు మంచి కీర్తిని ఇస్తుందా, ఇందుశేఖరా.  ఇవ్వదు కదా!  విరివింటి వానిని రూపుమాపి, అంబను వివాహమాడి, ఆమె కోరిక మీద ఆ మదనుని తిరగి జీవితుణ్ణి చేసినట్లుగా, జాగు సేయక మమ్మల్ని కూడా రక్షించు, ఉమాపతీ.*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss