ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999


ఎనుకటి నుంచే

శానా ఊర్ల లెక్కనే

మా ఊల్లె గుడ 

మాల,మాదిగోల్లను దగ్గరికి

రానిచ్చేటోల్లు కాదు.

అంటుడు, ముట్టుడు అనుకుంటనే 

ఆల్ల తోనే అన్ని పనులు సేపిచ్చుకునేటోల్లు. 

గంతే కాదుల్లా

దేవుని గుల్లల్లకు గుడ

రానిచ్చేటోల్లు గాదు.


అయితే..మా ఊల్లె

శానా మంది  

అంటుడు, ముట్టుడు

లేకుంట, కొంచెం దూరం దూరంగ  ఉండేటోల్లు.


మొదాల్ మొదాల్

మా మల్లారం ల 

బాగాయ్ బగ్గవ్వనే

చాయ్ దుకాణం పెట్టింది.

మాల,మాదిగొల్లు పోతే

ఆల్లకు ఏరే గిలాసలల్ల 

చాయ్ పోసేది. 


మంగలి కిట్టయ్య,

నారాయణలు 

సవురాలు తీసేటప్పుడు గాని,

సాకలోల్లు 

బట్టలుతికేటప్పుడు గాని,

గౌండ్లోల్లు 

కల్లు పోసేటప్పుడు గాని

అందరి లెక్కనే సూసెటోల్లు .


నలబై యేండ్ల కింద

' అన్నలు ' అచ్చినంక

అంటుడు,ముట్టుడు

మెల్ల మెల్లగా

అన్నీ బందు అయినయి.

గుల్లల్లకు పొవుడు సురువయింది.

సదువుకున్న పిలగాండ్లకు

గసొంటి పట్టింపులు 

ఎక్వ ఏం లేకుండే.

అన్ని కులాల 

సిన్న పిలగాండ్లు

బడిల కల్సి,మెల్సి  సదువుకునేటోల్లు,

ఆడుకునేటోల్లు. 

సోపతి గుడ సేసెటోల్లు.


ఎవ్వలైనా సరే! సదువుకుంటే

ఇలువ, కదర్ ఉంటది.

గిదంత అంబేడ్కర్ పున్నెమే!

గా అంబేడ్కర్ లేకుంటే,

రాజ్యాంగం వయిల సబ్బండ వర్ణాల గురించి రాయకుంటే

ఇంకా ఎనుకటి లెక్కనే

ఎడ్డిగ,ఊరికి దూరంగ ఉండుకుంట,సదువు లేకుంట,

అంటుడు,ముట్టుడు ఉండేది.

అందరి తల రాతలు బమ్మ దేవుడు రాత్తడు అంటరు గని

సబ్బండ వర్ణాల తల రాతలు మార్సి రాసిన దేవుడు అంబేడ్కరే.

ఔ మల్ల!


కామెంట్‌లు