ఔ మల్ల:-- బాలవర్ధిరాజు మల్లారం-871 297 1999
గప్పట్ల
ఎవుసం జేసెటోల్లు
తోలు సెప్పులే తోడుక్కునేటోల్లు.
కొందరైతే
కిర్రు కిర్రు మనే సెప్పులను సేయించుకొని 
బడాయి కొట్టేటోల్లు.
గా తోలు సెప్పులు ఏసుకుంటే
సిన్న సిన్న రవుతులు గాని,
తుమ్మ ముల్లు గాని, 
సర్కార్ ముల్లు గాని కుచ్చకుంట ఉంటయి.
గంతే కాదుల్లా
తొవ్వల పురుగు, బూసి ఉన్నగని ఏం గాదు.
శానా మంది ఆడోల్లు,
కొందరు మొగోల్లు,
సిన్న పోరగాండ్లు
సెప్పులు ఏసుకోక పోయేటోల్లు.
తొవ్వొంటి పోయేటప్పుడు గాని, పొలాలల్ల గాని,
సేన్లల్ల, సెలుకలల్ల గాని
తుమ్మ ముల్లు గాని,
సర్కార్ ముల్లు గాని  
కాళ్ళకు కుచ్చేటివి,ఇరిగేటివి.
ముల్లు ఇరిగినప్పుడే
అక్కడనే కూసొని 
ముల్లును ముల్లు తోనే తీసేటోల్లు.
తుమ్మ ముల్లు గుచ్చితే 
తుమ్మ ముల్లుతో గాని,
సూదితో గాని, కాంటతో గాని
కాలి ముల్లును తీసుకునేటోల్లు
సర్కార్ ముల్లు గుచ్చినా,ఇరిగినా 
బగ్గ నొచ్చేది.

శానా దినాలకు 
ఒకల్ను జూసి ఒకళ్ళు 
తోలు  సెప్పులను కాకుంట
లబ్బరి సెప్పులను,
బూట్లను ఏసుకునుడు 
సురువు జేశిండ్రు.
గా దినంల సిఎస్సీ సెప్పులు
గట్టిగ ఉండి, 
శానా రోజులు ఆగేటివి.

ఊరిల మాల, మాదిగొల్లు
ఎనుకబడ్డ కులపోల్లు
దొరలు అచ్చినప్పుడు
సెప్పులు ఇడుసుడో,
చేతుల పట్టుకునుడో 
జేసేటోల్లు.  
దొరలంటే గంత బయం, బక్తి ఉండేటిది.


కాలం ఎప్పుడూ ఒక్కతీర్గ ఉండది గద!
గిప్పుడు
ఎనుకటి లెక్క ఎవ్వలు
ఉంటలేరు.
మనుషులు మారిండ్రు
దొరలు గుడ మారిండ్రు
పపంచమే మారింది
ఔ మల్ల!

కామెంట్‌లు