తేజ చేసిన మేలు:- కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 మహికి పక్షులన్నా ,పిల్లులన్నా,కుక్కలన్నా ఎంతో ఇష్టం.ఓ బుల్లి కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు.ఇంటిబయట పిల్లికి పాలగిన్నె ఒకటి పెడతాడు.మరో చిన్న గిన్నెలో పక్షులకు నీళ్ళు, ప్లేటులో గింజలు పెడతాడు.
        మహికి జంతు,పక్షుల పట్ల ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న మామయ్య మహిని  కలువకొండకు తీసుక వెళ్ళి అక్కడ నిజంగా జరిగిన
 కథను గురించి చెప్పాలని  తీసుక వెళ్ళాడు.
         కలువకొండ అందమైన గ్రామం.చెట్లు,పొలాలతో ఎంతో అందంగా ఉంది.కలువకొండకు ఒక కిలో మీటరు దూరంలో ఉన్న పైడికొండ వద్దకు వెళ్ళారు.కొండ దిగువున ఓ పార్క్ కి వెళ్ళారు.పార్క్ లో ఒక అబ్బాయి,కుక్క శిలా విగ్రహాలను మహికి చూపించాడు మామయ్య.
      "ఆ విగ్రహాలు ఎందుకు పెట్టారు?"అడిగాడు మహి.
       "ఆ విగ్రహాలు ఎందుకు పెట్టారో చెబుతాను..."అని మామయ్య ఈ విధంగా చెప్పాడు.
      "వందేళ్ళ క్రితం ఈ కలువ కొండ గ్రామం పక్కనే పైడిముఖి అనే నది ప్రవహించేది.ఆ నదే పొలాలకి,త్రాగే నీటికి ఉపయోగ పడేది.ఒక వేసవి కాలంలో నది,ఊర్లో ఉన్న బావులు ఎండి పోయాయి.ప్రజలు త్రాగే నీటికి ఎంతో ఇబ్బంది పడ సాగారు.పొలాలు ఎండి పోసాగాయి! కలువకొండ లో రంగయ్య అనే రైతుకి గోపి అనే కొడుకు ఉండేవాడు.వాడు నీ లాగే జంతు,పక్షుల్ని ప్రేమగా చూసుకునే వాడు.'తేజ'అనే కుక్కను పెంచుకునే వాడు.ఆ కుక్క వాళ్ళింట్లో ఒక సభ్యుడిలాగ ఉంటూ ఎంతో విశ్వాసంగా ఉండేది.అలా కరవు సంభవించినపుడు పొలం ఎండిపోతున్న సంగతి,తాగే నీటి కొరతను గురించి తన భార్యకు,గోపీకి చెప్పి బాధ పడసాగాడు.రంగయ్య బాధతో చెప్పిన మాటల్ని తేజ బాగా గమనించింది.తనేమైనా సహాయం చెయ్యగలదేమో ఆలోచించింది! రంగయ్య కుటుంబానికి నీటి ఆవశ్యకత దానికి అర్థం అయింది. అంతే అది పరుగున ఊరి బయటకు  నీటి జాడ కనుక్కు-
నేందుకు వెళ్ళింది.ఒక వేళ నీటి జాడ కనబడితే రంగయ్య కుటుంబానికి తెలియ చేసి వారిని ఆదుకోవాలని దాని మంచి ఆలోచన.అది అలా వెళ్ళి ఊరి బయట రాళ్ళమధ్య కొంచెం పచ్చగడ్డి,పచ్చదనంతో ఉన్న చెట్టు దానికి కనబడ్డాయి.అక్కడ నీళ్ళు ఉండొచ్చనే అనుమానం దానికి వచ్చింది.గబ గబా రాళ్ళ మీదకు ఎక్కి  వాసన చూసి నీటి జాడ పసికట్టింది.తేజ అనుకున్నది సాధించింది.ఆ రాళ్ళ కింద జలం అంతర్వాహినిగా(అంటే భూమి లోపల) పారుతున్న నీళ్ళను కని పెట్టింది!వెంటనే అది పరుగున రంగయ్య ఇంటికి వెళ్ళి నీళ్ళ కుండను చూపి తాను నీటి జాడ కనుగొన్నట్లు గోపీకి సూచించి గోపీని తనతో రమ్మనట్టుగా  మొరిగింది. తేజ తనకు ఏదో సూచిస్తోందని గోపి తేజతో వెళ్ళాడు.రాళ్ళ మధ్య తాను కనిపెట్టిన నీటి జాడ చూపించింది.అక్కడ నీళ్ళు ఉన్నట్టు గోపీకి కూడా అనుమానం వచ్చింది.తేజ,గోపి పరుగున ఇంటికి వెళ్ళి రంగయ్య కు నీటి జాడ సంగతి చెప్పాడు.రంగయ్య గుణపంతో వెళ్ళి ఆ రాళ్ళ మధ్య త్రవ్వాడు.ఆయనకు తోడుగా మరో నలుగురు ఊరి వాళ్ళు  కూడా త్రవ్వడంలో సహాయం చేశారు.భూమిలో కొంత లోతులో గలగల పారుతున్న నీటి జాడ తెలిసింది.అందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు.
        ఆ విధంగా తేజ వలన ఆ ఊరికి నీటి కరవు తీరి పోయింది! అక్కడనుండి పెద్ద కాలువ త్రవ్వారు.త్రాగేందుకు,పొలాలకు నీరు లభించింది.ఆ విధంగా కలువకొండలో కరవు తీరి పోయింది.
        కాల ప్రవాహంలో తేజ చని పోయింది.కొన్ని సంవత్సరాల తరువాత గోపి,తేజ ఊరికి చేసిన మేలు మరచి పోకుండాఊరి వాళ్ళందరూ కలసి కుక్క తేజ, దానిని పెంచిన గోపి విగ్రహాలు ఈ పార్క్ లో ప్రతిష్టించి,ఇక్కడే ఆ చరిత్రను శిలా ఫలకం మీద వ్రాయించి పెట్టారు" అని వివరించాడు మామయ్య.
        ఆ విగ్రహాల వైపు చూస్తుండి పోయాడు మహి.
      "మహీ జంతువులకి, ముఖ్యంగా కుక్కలకి మనకన్నా పదివేల రెట్లు వాసనను పసిగట్టగలవు.అందుకే మన పోలీసులు ఏదైనా నేరం జరిగినపుడు,ఎవరైనా దుండగులు బాంబులు పెట్టినపుడు కుక్కల సహాయం తీసుకుని నేరస్థులను గుర్తిస్తారు"చెప్పారు మామయ్య.
        మామయ్య మంచి విషయాలు చెప్పి,చూపించినందుకు మహి ఎంతో సంతోషించాడు.