ఇంకొక పరీక్ష:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  విద్యాపతి గురుకులంలో ముకుందుడు, మోహ-నుడు విద్య పూర్తి చేసుకున్నారు,ఎన్నో పురాణాలు,చరిత్రలు మరెన్నో శాస్రాలు  అభ్యసించి గురువు గారికి గురుదక్షిణ సమర్పించి ఇక శెలవు తీసుకుంటామని చెప్పారు.
        అయినా విద్యాపతి గురుదక్షిణ తీసుకోకుండా ఈ విధంగా చెప్పాడు.
       "శిష్యులారా,చదువుకు అంతులేదు మీకొక పరీక్ష పెడతాను దానిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తే నాకు తృప్తి అనిపించినపుడు మీ గురు దక్షిణ స్వీకరిస్తాను"అని చెప్పి చెరొక ఇరవై వెండి నాణేలు ఇచ్చాడు.ఎందుకంటె వారి మానసిక స్థితి,ఆశావహ దృక్పధం పరీక్షించదలచుకున్నాడు.
       "మీరు ఈ వెండి నాణేలను తీసుకుని చెరొక ఊరికి వెళ్ళి మీ విద్య సార్థకమయ్యేటట్టు ఖర్చు పెట్టి సంవత్సరం తరువాత నాకు మీరు సాధించిన ఫలితాలు చెప్పండి"అని ఆశీర్వదింఛి పంపాడు.
         ఇద్దరూ తూర్పుకి ఒకరు,పడమరకు ఒకరు వెళ్ళి చెరొక ఊరు చేరుకున్నారు.
         ముకుందుడు గార్గేయపురం,మోహనుడు పత్తికొండకు చేరుకున్నారు.ముకుందుడు చేరిన గార్గేయపురంలో చాలామంది అతినీరసంగాను,అనారోగ్యంగా కనబడ్డారు.వెంటనే ముకుందుడు ఒక గురుకులం స్థాపించి ప్రజలకు సమతుల్య ఆహారం,రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేసి చాలామందిని ఆరోగ్యవంతులుగా తయారు చేశాడు. ప్రజలకు ముకుందుడి మీద నమ్మకం ఏర్పడింది.వారికి చదువు నేర్పించి పుస్తకాలు చదివే స్థాయికి తెచ్చాడు.పురాణాల్లో అనేక కథలను కూడా చెప్పి వారికి మంచి ఆలోచనలు కలిగేట్టు చేశాడు!
ముకుందుడి సలహాల వలన ఇటు ఆరోగ్యం,అటు విద్య నేర్చుకొనడం వలన ఊరు బాగు పడింది.
       మోహనుడు పత్తికొండలో ఒక పెద్ద తోట కొని అనేక పండ్ల చెట్లు వేసి పెద్ద పండ్ల వ్యాపారం చేసి విపరీతంగా డబ్బు సంపాదించాడు.అలా వచ్చిన డబ్బుతో ఊరిలో బావులు త్రవ్వించడం,మంచి చెట్లు వేయడం చేశాడు.అలా అక్కడి ప్రజలకు ప్రీతి పాత్రుడయ్యాడు!
       సంవత్సరం తరువాత ఇద్దరూ గురువు విద్యాపతి వద్దకు వచ్చి తాము గార్గేయపురం,పత్తి కొండలలో చేసిన మంచి పనులను గురించి వివరించారు.
        ఇద్దరి వివరణలు విని విద్యాపతి ఈవిధంగా చెప్పాడు.
         "చూడు,మోహనా నీవు మంచిపనులే చేశావు,అందులో కొంత డబ్బు సంపాదించాలనే స్వార్థం కనబడుతోంది,ప్రజల జ్ఞానంలో,చదువులో మార్పు తీసుకవచ్చే ప్రయత్నం చేయలేదు.పోతే ముకుందుడు ప్రజలకు ఆరోగ్యం గురించి,విజ్ఞానం గురించి బోధించి,వాళ్ళను చైతన్యపరచి ఊరిలో పెద్ద మార్పు తీసుకవచ్చాడు.ఆరోగ్యం,విద్య ఉంటే ప్రజల ఆలోచనా శక్తి పెరుగుతుంది సమాజంలో మంచి మార్పు వస్తుంది,ముకుందుడు నేను పెట్టిన పరీక్షలో తనేమిటో నిరూపించుకున్నాడు.మోహనా నీవు చేసిన మంచి పనులతో పాటు ప్రజల్లో జ్ఞానం పెంపొందించడానికి కృషి చెయ్యి,నీవుకూడా ఊరును తీర్చి దిద్దగలవు.ఏ ఊరైనా ఏరాజ్యం అయినా ప్రజలు జ్ఞానవంతులు అయినప్పుడే అభివృద్ది చెందుతుంది"అని వివరించాడు గురువు విద్యాపతి.
       గురువు చెప్పిన విషయాలు మోహనుడు అర్థం చేసుకుని పత్తికొండను అన్నివిధాల అభివృద్ధి చేయాలని నిశ్చయించాడు.
         ఇద్దరూ గురువు గారికి నమస్కారం పెట్టి తాము సంపాదించిన ధనం నుండి చెరొక వంద వెండి నాణేలు గురువుకు గురు దక్షిణగా ఇచ్చారు.
      విద్యాపతి చిరునవ్వుతో ఈవిధంగా చెప్పారు,"శిష్యులారా నాకు డబ్బు వద్దు,దయచేసి ఆ డబ్బుతో మీరు మన గురుకులానికి ఈశాన్యంలో బావి త్రవ్వించండి అది మన గురుకులానికే కాక ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది"అని చెప్పారు విద్యాపతి.
       గురువుగారి మంచిమనసుకు ఇద్దరూ ఎంతో సంతోషించి,బావి త్రవ్వించే కార్యక్రమం ప్రారంభించడానికి బయలుదేరారు.