కొత్త పద్ధతులు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   రైతు రాఘవయ్య కేవలం మామూలు పద్ధతుల్లో వ్యవసాయం చేయడమే కాకుండా,వ్యవసాయం లో కొత్త పద్ధతులు ప్రవేశ పెట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అనేక ప్రయోగాలు చేసేవాడు.అందుకే పంటలను పుష్కలంగా పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శప్రాయుడయ్యాడు.
         రాఘవయ్య పొలం ముందు ఉన్న దారిలో వెడితే ఒక శివాలయం ఉంది.ప్రతిరోజూ అనేక మంది భక్తులు శివాలయం దర్శించుకుని వెడుతుంటారు.
రాఘవయ్య పొలంలో ఒక బావి ఉంది దానిలో నీళ్ళు చేదతో తోడి పొలంకి పొయ్యే కాలువలో పొయ్యవలసి వచ్చేది.దీనికోసం రాఘవయ్య తన శాస్త్రపరిజ్ఞానంతో ఒక ఆలోచన చేశాడు.దారిలో కొంతమేర త్రవ్వి,అక్కడ నడవడానికి ఇబ్బంది లేకుండా చెక్కలు అమర్చాడు.చెక్కల క్రింద తగిన విధంగా ఒక(స్ప్రింగు) అమరికతో యంత్రం అమర్చాడు.దాని నుండి బావి చేదకు ఒక కప్పీ,తాడు అమర్చాడు.దాని వలన శివాలయానికి వచ్చి పోయే భక్తులవలన ఆ చెక్కలపై వత్తిడి పడి కప్పీ,తాడు కదలి చేద బావి లోకి వెళ్ళి నీళ్ళు తోడి కాలవలో పోస్తుంది,దీని వలన శ్రమ తప్పుతుంది పుష్కలంగా నీరు పొలానికి అందుతుంది.అదీ సంగతి.
        ఈ సూత్రం గమనించిన ఇతర రైతులు కూడా రాఘవయ్య సలహాలు తీసుకుని తమ పొలాల్లో ఆ సాంకేతికను అమర్చుకున్నారు.
          రాఘవయ్య రైతులకు చేస్తున్న మేలును గమనించిన గ్రామపెద్ద రాఘవయ్యకు సన్మానం చేసి అతని పరిశోధనలలో తమ సహకారం ఉంటుందని ప్రకటించాడు.
        రైతులు రాఘవయ్య వద్ద సాంకేతిక సలహాలు తీసుకుంటూ అధిక పంట దిగుబడులు పొంద సాగారు.
         రాఘవయ్య మరిన్ని పరిశోధనలకు శ్రీకారం చుట్టాడు.
          అందుకే మనచుట్టూ ఉన్న వనరుల్ని తగిన విధంగా ఉపయోగించుకుంటే శ్రమ తగ్గి, పని సులువు అవుతుంది.