అపాయానికి ఒక ఉపాయం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  కొన్ని వందల సంవత్సరాల క్రితం కొండల్లో ఓ పొట్టేలు తన ముగ్గురు పిల్లలతో ఓ గుహలో ఉంటోంది.మరి రోజులు బాగ లేవుకదా! అందుకని తల్లి పొట్టేలు గుహ ద్వారానికి కర్రలతో గట్టిగా ఒక తలుపు అమర్చింది.
            ఆ చిన్న పిల్లలు తిండికి బయటకు వెళితే ఏ క్రూర మృగమో గుటుక్కు మని పిస్తుందని తల్లి పొట్టేలుకు చాలా భయం. అందుకే తల్లి పొట్టేలు పిల్లలను జాగ్రత్తగా గుహలో పెట్టి జాగ్రత్తలు చెప్పి పచ్చగడ్డి తెచ్చేందుకు వెళ్ళేది.
          మూడు పిల్లలు  అమ్మ బయటికి వెళ్ళినపుడు గుహలోనే ఆడుకుంటూ ఉండేవి.
           ఇలా ఉండగా ఒక రోజు తల్లి పొట్టేలు దూరంగా సంచరిస్తున్న క్రూరమైన నల్ల తోడేలును చూసింది.అంతే పొట్టేలు గుండెల్లో రాయి పడింది!ఎందుకంటే పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా మోసం చేసో,మాయమాటలు చెప్పో తన పిల్లలను తీసుకపోతే ఎలా అని దిగులు పడింది.
        మరింత పటిష్టంగా గుహ తలుపు తయారు చేసింది.ఒకరోజు తల్లి పొట్టేలు గుహ నుండి బయటకు రావడం ఆ తోడేలు గమనించింది,అదిగాక దానికి పిల్లలు ఉన్నట్టు కూడా గమనించింది.కానీ ఎన్ని పిల్లలు ఉన్నాయో అది తెలుసుకోలేదు.
      అప్పటినుండి తోడేలు గుహ పక్కనున్న చెట్ల పొదలో దాక్కుని గుహలోకి ఎలా పోవాలా అని ఆలోచించ సాగింది!దానికి ఒక రోజు తల్లి పొట్టేలు పిల్లలకు చెబుతున్న జాగ్రత్తలు వినబడ్డాయి!
        "పిల్లలూ,నేను మీకోసం గడ్డి తెచ్చేందుకు బయటికి వెళ్ళినపుడు ఎవరైనా పిలుస్తే తలుపు తీయకండి,నేను గడ్డి కోసుకుని వచ్చినపుడు నేను మిమ్మల్ని పిలచి నా ఎర్రటి చేతిని పైన తలుపుసందులో పెడతాను,నా చేతిని గమనించి తలుపు తీయండి.అంతేగాని నలుపు చెయ్యి కనబడితే తలుపు తీయకండి"అని జాగ్రత్తలు చెప్పింది.ఆ మాటలు తోడేలు విన్నది.ఏదైనా ఉపాయం చేసి ఆ పిల్లను ఎత్తుక పోవాలని అది దుష్ట ఆలోచన చేసింది.మరి తన శరీరం నలుపు శరీరం,అందుకే అది కొండల్లో వెతికి ఓ గోరింటాకు చెట్టు ఆకులు కోసి తన రెండు ముందర కాళ్ళకు పట్టించింది,ఓ రెండు గంటల్లో అవి ఎర్రగా మారి పోయాయి!
          తల్లి పొట్టేలు గడ్డి కోసం బయటకు వెళ్ళిన కొంత సేపటికి తోడేలు గుహ తలుపు దగ్గరకి వెళ్ళి గొంతు మార్చి పిల్లను పిలుస్తూ తన చేతిని తలుపు సందులో పెట్టింది,గోరింటాకు వలన దాని చెయ్యి ఎర్రగా ఉండేసరికి తమ తల్లే వచ్చిందని పిల్లలు తలుపు తీశాయి.అదృష్టవశాత్తు పెద్ద పిల్ల మటుకు చిన్న గడ్డి కుప్పలో గడ్డి కప్పుకుని పడుకుంది! తలుపు తీస్తూనే తోడేలు తన పళ్ళను క్రూరంగా బయటకు పెట్టి కనబడిన రెండు పిల్లలను తీసుకుని తన గుహకు వెళ్ళి పోయింది.పెద్ద పిల్ల లబోదిబోమన్నది.
       కొద్ది సేపటికి  గడ్డి తీసుకుని తల్లి పొట్టేలు వచ్చింది.రెండు పిల్లలనూ తోడేలు మోసం చేసి తీసుక పోయినట్టు చెప్పి ఏడ్చింది.
    "నీవే భయపడకు,నీ తమ్ముళ్ళని తోడేలు నండి రక్షిస్తాను"అని చెప్పి గుహలో మూలన కుండలో ఉన్న పొట్టేలు పాల వెన్న కుండతో సహా తీసుకుని తోడేలు గుహవద్ధకు వెళ్ళి పక్కనే ఉన్నకొండ కొసనున్న రాయి మీద వెన్న బాగా పూసింది! తరువాత తోడేలు వద్దకు వెళ్ళి "నేను లేనప్పుడు నా పిల్లల్ని తీసుక వచ్చావు నీవు వట్టి పిరికి దానివి,నీకు ధైర్యం ఉంటే నాతో పోట్లాడి నన్ను ఓడించి నన్ను,నా పిల్లలను కూడా తినేయ్" అంది.
        నిజానికి పొట్టేలు కంటే తోడేలు బలం ఎక్కువ కదా! ఆ ధైర్యంతోనే "సరే పద తేల్చుకుందాం"అంటూ గుహ బయటకు వచ్చింది తోడేలు, పొట్టేలు తెలివిగా కొండ కొసకు పరుగెత్తి ఒక చోట ఆగి పోయింది, పొట్టేలును పట్టుకోవాలన్న ఆలోచనతో తోడేలు పరుగెత్తి కొసనున్న రాయి ఎక్కింది, అంతే పొట్టేలు పూసిన వెన్న వలన అది జారి కొండపైనుండి లోయలో పడి ప్రాణాలు విడిచింది,తన ప్రణాళిక పారి నందుకు పొట్టేలు "హుర్రే"అని అరచి తన రెండు పిల్లలను తీసుకుని తన గుహలోకి వెళ్ళి పోయింది.
        చూశారా పొట్టేలు తన ఉపాయంతో అపాయాన్ని జయించింది!