నిజాయితీ విలువ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   రాజ వీధి లో ఉన్న గణపతిరావు ఇల్లు ఎప్పుడూ కళకళ లాడుతూ ఉంటోంది.పోనీ అతను ధనవంతుడా అంటే కాదు!గణపతి రావు కేవలం నీతి న్యాయం మాత్రమే ఆచరిస్తాడు,చేతనైనంతలో అవసరమున్న వారికి సహాయం చేస్తూ ఆదుకునే వాడు.అందుకే ఆ ఇంటి ముందుకు ఎవరు వచ్చినా వారికి ఏదో హాయిగా అనిపించేది.ఎవరైనా అతిథి వారింట్లో భోంచేస్తే ఏదో తెలియని తృప్తి.మంచి గుణాలు,మంచి ఆలోచనలు ఎప్పుడూ శుభకరమైన శక్తి కిరణాలను ప్రసరింపచేస్తుంటాయి అంటే అతిశయోక్తి కాదు.
         ఒకరోజు బిచ్చగాడొకడు గణపతిరావు ఇంటి వద్దకి వచ్చి బిచ్చమడిగాడు.గణపతిరావు భార్య కాస్త అన్నం,పప్పు అతని గిన్నెలో వేసింది.
           ఆ అన్నం తిన్న వాడికి ఏదో నూతన శక్తి వచ్చినట్లయింది,చిత్రమేమిటంటే ఇతర ఇళ్ళలో తీసుకున్న బిక్షం తింటే మామూలుగానే ఉండేది.
ఎందుకు అలా జరుగుతోందో వాడికి తెలియలేదు! ఇక రోజూ వాళ్ళింటికి వెళ్ళి బిక్ష తీసుకోవడం వాడికి అలవాటు అయిపోయింది.
            ఒకరోజు బిక్ష తీసుకుని ఒక ఇంటి వసారాలో కూర్చుని తింటున్నాడు.అప్పుడే అటుగా వెళ్తున్న ఒక తపఃసంపన్నుడైన సన్యాసి బిక్ష గాడు తింటున్న భోజనానికేసి చూశాడు.ఆ భోజనం ఆయనకు కాంతి రేఖలు విరజిల్లుతూ కనబడింది!ఆ అన్నం నీతిగా బతికే వారి ఇంటినుండి వచ్చిందని సన్యాసికి అర్థం అయింది.
           "ఈ అన్నం ఎవరు ఇచ్చారు నాయనా?"అడిగాడు సన్యాసి.
        ."అదిగో స్వామీ ఆ కనబడే ఇల్లే"అంటూ ఆ ఇల్లు చూపించాడు.
      ఆ ఇంటి ముందుకు వెళ్ళిన సన్యాసికి  ఆ ఇంటి వారి  మంచితనం అర్థమయింది.
        అదే పక్కవీధిలో ఉన్న ధనవంతుడు పద్మాకర్ ఇంటి ముందుకు వెళ్ళినా ఏ హాయి కలిగేది కాదు,అతను వేసిన బిక్షమామూలుగానే ఉండేది, ఎందుకంటే అతను వ్యాపారంలో అనేక మోసాలు చేసి సంపాదించాడు.
        సన్యాసి వారికి మంచితనాన్ని గురించి నిదానంగా పురాణాల్లోని శ్లోకాలను ఉదాహరించి చెప్పాడు, అయినా పద్మాకర్ సన్యాసి మాటలు వినలేదు. ఒక సంవత్సరంలోనే వ్యాపారంలో పద్మాకర్ కి తీవ్ర నష్టం వచ్చింది!
    .   . బిక్షగాడు లో చైతన్యం వచ్చి బిచ్చమడగటం మానివేసి చిన్నగా పండ్ల వ్యాపారం పెట్టుకొని బాగు పడ్డాడు.
             మంచితనం,నీతి,నిజాయితీ ఉంటే కనబడని మంచి ఫలితాలు ఉంటాయి,మంచిగా ఉండేవారి వలన చుట్టూ ఉన్న వారికి కూడా మేలు జరుగుతుంది.
          ఇది అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం.
           

కామెంట్‌లు