పిల్లి ప్రతిభ;--కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445


 రంగారావుకి జంతువులు,చెట్లు,కళలు అంటే చాలా ఇష్టం.ఆయన ఇంట్లో బోలెడు కళాఖండాలు ఉన్నాయి,వీణ,ఫిడేలు,పియోనా కూడా ఉన్నాయి.కుందేళ్ళు,ఓ మంచి జాతి కుక్క ఉన్నాయి.

       ఒకరోజు రంగారావు గదిలోకి గోధుమ రంగు పిల్లి వచ్చింది.అది ఎంతో బాగుంది.దానిని పెంచుకోవాలని రంగారావు మూచ్చట పడ్డాడు.మరి దాన్ని మచ్చిక చేసుకోవాలి కదా!

     వెంటనే వంట ఇంట్లోకి వెళ్ళి చిన్న స్టీలు ప్లేటులో పాలు తెచ్చి ఓ మూల పెట్టాడు.ఇక పిల్లి విషయం చెప్పాలా? పాలంటే దానికి మహాఇష్టం కదా. అది గబగబా ప్లేటు దగ్గరికి వెళ్ళి ఆవురు ఆవురు మంటూ పాలు తాగింది.

   అలా రంగారావు దానిని విపరీతంగా ముద్దు చేయడం వలన రంగారావు వడిలోకి ఎక్కికూర్చునేది,పాలు,పాలన్నం బాగా తినేది.

       ఈ పిల్లి వ్యవహారం అంతా కుక్క గమనించ సాగింది.రంగారావు పిల్లికి అంత ప్రాముఖ్యం ఇవ్వడం అది సహించలేక పోతోంది!

        పిల్లి తనకన్నా దేంట్లో గొప్ప అనుకోసాగింది కుక్క.రంగారావు దగ్గరగా కుక్క మసలుకో సాగింది.అయినా రంగారావు దానిని మామూలుగానే చూస్తున్నాడు.

         తన యజమాని పిల్లిని పెంచుకుంటున్నాడు కనుక, కుక్క పిల్లిని  ఏమనలేక పోతోంది.

      ఒకరోజు పిల్లి ఇటు అటు గెంతుతూ పియోనా మీదకు ఎక్కి  ఇటు అటు తిరిగింది,చిత్రంగా అది లయబద్దంగా తిరిగే సరికి చెవుల కింపైన సంగీతం పియోనా లోంచి వచ్చింది.

       ఆ సంగీతాన్ని విన్న రంగారావు చప్పట్లు కొడుతూ,పిల్లిని భలే పొగిడాడు!

       ఇదంతా కుక్క గమనించి ఇలా అనుకుంది"ఔరా, పిల్లికి మనుషుల మోస్తరు పియోనా వాయించడం వచ్చు ఇంకెన్ని విద్యలు వచ్చో,అందుకే నా యజమాని దాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు,మరి నేను కూడా పిల్లిని స్నేహంగా చూస్తాను"అనుకుంది.

అసలు విషయం ఏమిటంటే,పిల్లి మామూలుగానే పియోనా మీద నడిచింది,కానీ దాని అడుగుల వత్డి వలన ఓ మంచి సంగీతం పుట్టింది.ఆ సంగీతానికి యజమాని ఆనందం అనుభవించాడు,కుక్కకు పిల్లి మీద గౌరవం పెరిగి పోయింది.అదీ సంగతి.