*తోక లేని కోతి (సరదా బాలల సరదా కథ)* :-పునః కథనం: డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక అడవిలో ఒక మామిడి చెట్టుపైన ఒక కోతి ఉండేది. దానికి అందమైన పొడవాటి తోక ఉండేది.
‘జింకకు కొమ్ములు అందం, నెమలికి పింఛం అందం, పులికి చారలు అందం, సింహానికి జూలు అందం. అలాగే నాకు నా తోక అందం' అని ఆనందంతో మురిసిపోయేది.
ఆ చెట్టు కింద ఒక కుందేలు , జింక ఉన్నాయి. వాటికి చిన్న చిన్న తోకలు ఉన్నాయి. అవి కోతి తోక చూసి బాగా అసూయపడేవి. దీని తోక ఎప్పుడో ఒకసారి విరిగి పోతే బాగుంటుంది అనుకునేవి. దానిని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఏడిపించేవి.
ఒకరోజు సాయంకాలం జింక, కుందేలు చెట్టు పైకి చూసి చాలా ఆశ్చర్యపోయాయి.
ఎందుకంటే కోతికి తోక లేదు. మొత్తం ఊడి పోయింది. అది చూసి అవి చాలా సంబరపడ్డాయి.
“ ఓయ్... కోతీ... ఏమైంది నీ తోక. ఇప్పుడు నువ్వు ఎలా వున్నావో తెలుసా. అచ్చం  ఈకలు పీకేసిన కోడిలాగా, గుండు కొట్టిచ్చుకున్న సింహం లాగా , తొండం లేని ఏనుగులాగా ఉన్నావు. మాకు చూడు ఇప్పుడు నీకన్నా పెద్ద పెద్ద తోకలు వున్నాయి" అంటూ పక పక పక నవ్వుతూ కోతిని వెక్కిరించాయి. 
అంతలో చెట్టు మీద కూర్చున్న కోతికి దూరంగా ఒక పులి రావటం కనబడింది. వెంటనే అది 'ఓ పిచ్చి జంతువులారా... నా తోకను నేనే కొండ కింద వున్న హనుమంతునికి నైవేద్యంగా ఇచ్చాను. ఆయన సంతోషించి శత్రువును ముందుగా కనిపెట్టే వరాన్ని నాకు ఇచ్చాడు. తోక కన్నా ప్రాణాలే ఎక్కువ ముఖ్యం కదా. అందుకే దాన్ని వదిలేసాను. ఇదిగో ఇటువైపు కాసేపట్లో పులి వస్తుంది. మీరు తొందరగా దాక్కోండి" అనింది. రెండూ అలాగా అంటూ గబగబా దాక్కున్నాయి.
అంతలో పులి అక్కడికి వచ్చి ఏమీ కనబడక వెళ్ళిపోయింది. దానితో కోతి చెప్పిన మాటలు నిజం అని జింక, కుందేలు నమ్మాయి. అవి గూడా తమ తమ తోకలని కత్తరించుకోని హనుమంతునికి నైవేద్యం పెట్టాయి. కానీ కోతి చెప్పినట్టు అవి శత్రువుల రాకను ముందుగానే కనిపెట్టలేక పోయాయి. 
అప్పుడు కోతి నవ్వి "చూడు మిత్రులారా... ఒక బోనులో ఇరుక్కుని నా తోక తెగి నేను బాధ పడుతుంటే ఓదార్చాల్సింది పోయి నన్నే వెక్కిరించి ఏడిపిస్తారా. అందుకే మీకు బుద్ధి రావాలని అలా చెప్పాను. ఇప్పుడు నాకే కాక మీకూ తోకలు లేవు. సరిపోయిందా” అంటూ అక్కన్నించి వెళ్ళిపోయింది.

కామెంట్‌లు