నెత్తుటి దీపం* :-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), చిట్యాల,నల్గొండ 9542236764
ఈ అనంత విశ్వంలో మరపురాని మధుర నేస్తం 
మనసు పలకపై తొలి పలుకులు నేర్పే ఆదిగురువు

అలసిన రెక్కలకు కొత్త ఊపిరి పోసే ప్రాణవాయువు
అనంత దిగంతాలకూ దశదిశను సూచించే దిక్సూచి

కుటుంబ శ్రేయస్సుకై అనుక్షణం స్పందించే హృదయం
అనుబంధాల బంధనాలతో అణువణువర్పించే శ్రమజీవి

కష్టాల చీకటిలో కాంతి వెదజల్లే నెత్తుటి దీపం
అనురాగాప్యాయతలు వర్షించే అమృత మేఘం

సహనం సౌశీల్యం కలబోసిన కరుణామయి
తను పస్తులున్నా కన్నపేగు కడుపు నింపే త్యాగమయి

జీవన మాధుర్యం పంచే పంట కాలువ మాతృ దేవత
కమ్మనైన అమ్మ పిలుపుకు పులకరించే పుడమి తల్లి 

తనదేహపు పచ్చినెత్తురు దారవోసే సృష్టికి మూలం
మాతృత్వం ఓ వరం!మధురాతి మధుర జ్ఞాపకం!!
అనుభవించి ఆస్వాదించి ఆశీర్వదించే అమ్మా వందనం!

(మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...) 


కామెంట్‌లు