వింత పోట్లాట:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి . మొబైల్: 9908554535.


 ముగ్గురు బాటసారులు కాలినడకన ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి నడుస్తున్నారు. అందులో ఒకడు "నీ పేరేమిటి "అని ప్రశ్నించాడు? ఒకరు " రమేష్" అని మరొకరు" ఆనంద్ "అని చెప్పారు .ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి "నా పేరు గోపి "అని తనకు తాను గా పరిచయం చేసుకున్నాడు .

       ఇంతలో రమేష్ ఆనంద్ తో " నీవు నా ప్రక్క  ఇంటిలోనే ఉంటావా !నా ప్రక్కనే నడుస్తావా !సిగ్గు లేదు" అని అన్నాడు. ఆనంద్ కూడా" అవును. నీకు కూడా సిగ్గు లేదు .నా ప్రక్కన నీవు కూడా ఎందుకు నివాసం  ఉండాలి. నా పక్కనే ఎందుకు నడవాలి? ఇంకొక చోట వేరే ఇల్లు కట్టుకో కూడదు" అని అన్నాడు. "నీవు నన్ను నీవు అంటావా! నీకు బుద్ధి లేదు" అని అన్నాడు రమేష్.    "తప్పకుండా అంటాను. నీకే బుద్ధి లేదు "అని స్వరం పెంచాడు ఆనంద్ .

       అప్పుడు రమేష్" నీ కంటే  పెద్దవాడిని. నాకు బుద్ధి లేదంటావా !గాడిదా "అని అన్నాడు.అది విన్న  ఆనంద్ కోపంతో "నీవే గాడిదవు.కుక్కవు" అని నిందించాడు. ఇద్దరూ ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని కొట్టుకోవడానికి తయారయ్యారు. ఇదంతా చూస్తున్న గోపి వారిని ఆపి" చూడండి! మీరు ఇంత సేపు మంచిగా కలసి మెలసి ఉన్నారు. ఇప్పుడు ఈ తగవులాట దేనికి?  మీరు మిత్రులా  లేకుంటే శత్రువులా" అని అన్నాడు.

        అది విన్న రమేష్ "మేము మిత్రులం కాదు. శత్రువులు అంతకన్నా కాదు .అన్నదమ్ములం. మా ఇంట్లో పోట్లాటలు తగవులాటలు లేవు. మా భార్యల ముందు అలా చెయ్యమని మా నాన్న గారికి మాట ఇచ్చాము. అందుకే ఇలా ఊరిబయట నడుస్తూ తమాషాకు  అప్పుడప్పుడు ఇలా  పోట్లాడుకుంటాము. ఇది ఉత్తుత్తి పోట్లాటే. ఒకవేళ మాటా మాటా పెరిగి నిజంగా మేము కొట్టుకుంటే మాలో ఎవరిది తప్పని నిర్ణయించడానికి మధ్యవర్తిగా మీరు ఉండనే ఉన్నారు కదా !ఇక మాకు భయం దేనికి "అని అన్నారు .అలా వారు వెనక్కి తిరిగి చూసేసరికి గోపి అక్కడ లేడు. అతడు పారిపోవడంచూసి  వారిద్దరూ  నవ్వుకున్నారు.

                  అందుకే కనిపించినవన్నీ నిజాలని  భ్రమపడకూడదు.