నడక:--- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి మొబైల్: 9908554535.

  ఒక పిసినిగొట్టు ఆసామి తన మిత్రునితో కలిసి నూనె ప్యాకెట్  తెచ్చుకుందామని బజార్ కి వెళ్ళాడు. ఒక షాపులో దాని ఖరీదు వంద యాభై రూపాయలు అని చెప్పారు. మరొక షాపులో అడుగుదామనుకుని రెండు కిలోమీటర్ల దూరం నడిచారు. అక్కడ వారు ఆ నూనె ప్యాకెట్ కు 160 రూపాయలు అని చెప్పారు. ఇక్కడి కన్నా మొదటి షాపులోనే నయం అనుకొని అతడు తన మిత్రునితో కలిసి మొదటి షాపుకు తిరిగి వచ్చాడు. వారు దాని ధరను ఈసారి 170  రూపాయలు చెప్పారు. "ఇంతకుముందు వంద యాభై రూపాయలే చెప్పారుగా" అని ఆ ఆసామి వారిని ప్రశ్నించాడు. అప్పుడు దాని ధర పెరిగిన సంగతి తమకు తెలియదని, ఇప్పుడే తెలుసుకున్నామని వారు తెలిపారు. "ఇదివరకటి  షాపులో 160 రూపాయలు అని చెప్పారు. మీరు అదే ధరకు  ఇవ్వండి.లేకుంటే అక్కడే తీసుకుంటాం"  అని అన్నాడు ఆ ఆసామి. వారు అక్కడే తీసుకోమని చెప్పారు.
         వెంటనే ఆ ఆసామి తన మిత్రునితో మరలా ఆ షాప్ కి వెళ్లి 160 రూపాయలకే ఆ నూనె ప్యాకెట్ ను కొన్నాడు. అప్పుడు అతని మిత్రుడు "అనవసరంగా ఒక పది  రూపాయలకు రెండు కిలోమీటర్ల  దూరాన్ని నన్ను  నడిపించావు .మొదటనే తీసుకుంటే నీకు పది రూపాయలు మిగిలేవి కదా !ఇప్పుడు నీకు 10 రూపాయల నష్టం వచ్చింది కదా" అని అన్నాడు .
         అది విన్న ఆ ఆసామి "అదేం లేదు .నేను అజీర్తికి మాత్రలు కొందామని అనుకున్నాను. వాటి ధర 20 రూపాయలు. ఈ నడక వల్ల నాకు తిన్న ఆహారం జీర్ణం అయింది. అందువల్ల నాకు ఆ మాత్రలతో పనిలేదు .నాకు 20 రూపాయలు లాభం వచ్చినట్టే  కదా "అని అన్నాడు.
           అప్పుడు మిత్రుడు" నీకు 20 రూపాయలు  లాభం వచ్చింది .మరి నాకో "అని అన్నాడు ."నీకు కూడా ఆరోగ్యం కలిగింది .నీకు నిద్ర పట్టడం లేదని అన్నావు కదా! ఇప్పుడు ఈ నడక వలన నీకు  మంచి నిద్ర వస్తుంది .ఇంటికి వెళ్లి హాయిగా  "అని అన్నాడు ఆ పిసినారి."అయ్యో! అన్నం తినకుండానే "అని అన్నాడు ఆ మిత్రుడు తనకు వాళ్ళ ఇంట్లో భోజనం పెడతాడేమోనని. "అదేం లేదు. తర్వాత అన్నం మీ ఇంట్లో నీవు తినవచ్చులే .ముందు మీ ఇంటికే వెళ్లి నీవు హాయిగా   పడుకో" అని అన్నాడు. ఆ మాటలకు మిత్రుడు ఆశ్చర్యపోయాడు.
        అందుకే పిసినారితో  స్నేహం చేయడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు .