నిజం - అబద్దం:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554635.

  రామాపురం లో ఒక బాటసారి దారిలో వెళుతూ సోమయ్య ఇంటిముందు ఆగాడు. ఆ ఇంటి ముందు సోమయ్య చిన్న కొడుకు   రవి ఆడుకుంటున్నాడు.
        ఆ బాటసారి రవిని పిలిచి వారి ఇంటి ముందున్న ఆవును చూపి   "అది ఏమిటి "అని ప్రశ్నించాడు. ఆ బాలుడు" గుర్రం" అని అన్నాడు. ఆ బాటసారి ఆశ్చర్య పోయి" బాబూ ! అది గుర్రం కాదు . ఆవు  "అని అన్నాడు. ఆ బాలుడు "కాదండీ! అది గుర్రమే"అని అన్నాడు.   వెంటనే ఆ బాటసారి " బాబూ! అబద్ధం ఆడవద్దు. అది ఆవు .అదిగో! కొంచెం దూరంగా  ఉన్నది గుర్రం" అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు "కాదండీ!మీరు గుర్రం అంటున్నారే.   అదే ఆవు. నేను అబద్ధాలు ఆడను. కావాలంటే మా అమ్మను పిలిచి అడగండి" అని అన్నాడు.
       అప్పుడు ఆ బాటసారి వాళ్ళ అమ్మను  పిలిచి "ఏమండీ! పిల్లలకు నిజం చెప్పాలి కానీ అబద్ధాలు చెప్తారా! మీరేం తల్లిదండ్రులు" అని అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ "ఏమండోయ్! కాస్త మర్యాదగా మాట్లాడండి .మేము అబద్దం ఆడడం లేదు .మా వాడు చెప్పింది నూటికి నూరు పాళ్లు  కరెక్టే .అది గుర్రమే "అని అంది .
          ఈలోపుగా ఈ గొడవ విని అక్కడకు వచ్చిన పొరుగింటి ఆసామి రామయ్య" అయ్యా! బాటసారి గారూ! ఆ బాలుడు చెప్పింది నిజమే.వారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. నీవు చెప్పింది కూడా నిజమే .వారు  గుర్రాన్ని "ఆవు" అని ,"ఆవును గుర్రం"అని  పేర్లు మార్చి  పిలుచుకుంటారు .ఈ సంగతి నీకు తెలియక ఏమేమో అంటున్నావు .వారి విషయంలో నీవు తల దూర్చడం నీదే తప్పు .పైగా నిజాలు తెలియక  వారు అబద్ధం చెబుతున్నారని  నీవే వారిని నిందిస్తున్నావు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏమి మాట్లాడకూడదు "అని అన్నాడు.
         ఆ మాటలకు బాటసారి ఆశ్చర్య పోయి అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
          అందుకే అనవసర విషయాల్లో తలదూర్చే వాళ్లకు అవమానాలు తప్పవు.