కళ్యాణం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 మూడుముళ్ళ బంధం అది
ఏడడుగుల నమ్మకం‌అది
"నాతిచరామి" అని ప్రమాణం చేసి
పాణిగ్రహణంతో పవిత్రమైన గృహస్థాశ్రమం
పెళ్ళిచూపులతో మొదలై
నిశ్చయతాంబూలాలు పుచ్చుకొని
వియ్యాల వారి ముచ్చట్లతో
అదిలింపులతో,కోరికలతో
అలకపాన్పులు,కాశీయాత్రలు
విడిది ఇంట్లో సరసాలతో,కోపాలతో
ఎదుర్కోళ్ళతో,గౌరీపూజలతో,వరపూజలతో,అగ్నిహోత్రం సాక్షిగా
బంధుమిత్రుల శుభాశీస్సులతో
మూహూర్తవేళ,జిలకర బెల్లంతో
ముడిపడి
మాంగల్యధారణతో మమేకమై
తలంబ్రాలతో తన్మయత్వం‌ పొంది
పాలాశహోమాలు,ప్రాయాశ్చిత్తాది క్రతువులతో సాగి
మెట్టెలు తొడిగించి,కాళ్ళతో సున్నితంగా తొక్కించి
మొంటెవాయనాలు,ఒడిబియ్యాలతో నిండిపోయి
అప్పగింతలతో ఆర్ద్రమై,సత్యనారాయణ
వ్రతాలతో
మ్రొక్కులు మొక్కి,సత్సాంతన కాంక్షతో,గర్భాదాన మూహూర్తాలతో
దంపతులొక్కటయ్యే వేళ సంపూర్ణమవుతుంది
"పెళ్ళి" రెండు మనసుల కలయికతో మొదలై
రెండు ప్రాణాలొక్కటై బంధంలో బలంగా ముడిపడుతుంది.