గురువే దైవం:--*మంజీత కుమార్-బెంగుళూరు
అక్షరాలు దిద్దిoచే  మాస్టార్లు
మంచి చెడులు నేర్పే టీచర్లు
మట్టిలో మాణిక్యాన్ని వెలికితీసే నేర్పరులు
మొద్దు బుర్రలను సానపెట్టే విజ్ఞానులు

గుంజీలు తీయించినా
బెంచి ఎక్కించినా
అంతా మంచికే
విద్యార్థి భవిత మారేందుకే

అల్లరిని భరిస్తారు
తప్పొప్పుల జ్ఞానం కలిగిస్తారు
అలుసుగా తీసుకుంటే మందలిస్తారు
వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు

అమ్మలా లాలిస్తారు
అజ్ఞానాన్ని క్షమిస్తారు
జీవిత పాఠాలు నేర్పుతారు
జీవన గమనాన్ని మార్చుతారు

గురువును దైవంతో పోల్చితిమి
తల్లిదండ్రుల తర్వాతి స్థానం ఇచ్చితిమి
ఉపాధ్యాయుల నీడన నడత నేర్చితిమి
భవిష్యత్తును అందంగా మలచితిమి