కోతితో స్నేహమా? (కథ) సరికొండ శ్రీనివాసరాజు

 అనగనగా ఒక అడవిలో ఒక కోతి దురుసు స్వభావం కలిగేది ఉండేది. దానితో ఏం మాట్లాడినా కష్టమే. అందుకే చాలా జంతువులు, పక్షులు దానికి దూరంగా ఉండేవి. ఈ మధ్యనే ఒక రామచిలుక ఆ కోతితో స్నేహం చేయడానికి ప్రయత్నించింది. తరచుగా కోతి యోగక్షేమాలు విచారించడమే కాక కోతితో స్నేహ పూర్వకంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన ఒక పావురం. "శుక మిత్రమా! దురుసు స్వభావం కలవారితో స్నేహం తగదు. అది ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే." అంది. "నేను ఖచ్చితంగా ఆ కోతి స్వభావాన్ని మార్చుతాను చూడు." అంది రామచిలుక. "నీ ఖర్మ." అంది పావురం.
ఒకరోజు కోతి ఎందుకో తనలో తాను నవ్వుకుంటుంది. అప్పుడు రామచిలుక కోతి వద్దకు వెళ్ళి "ఏం మిత్రమా! నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏమైంది నీకు. ఏమైనా తిన కూడనిది తిని మెదడు పని చేయడం లేదా?" అని ఇతర జంతువుల ముందు కోతితో తన చనువును నిరూపించుకోవడానికి బడాయిగా అంది రామచిలుక. "నా దగ్గరకు రా మిత్రమా!" అని ఆప్యాయంగా పిలిచింది కోతి. రామచిలుక దానికి దగ్గరగా వెళ్ళింది. కోతి అమాంతం రామచిలుక గొంతు పట్టుకొని పైకెత్తి "నాకే మెదడు లేదని అంటావా? నిన్ను చంపేస్తాను చూడు." అంది. రామచిలుక ప్రాణభయంతో వణికిపోయింది. అప్పుడే ఆ కోతికి తల్లి అయిన మరో కోతి అక్కడికి రాగానే కోతి రామచిలుకను వదిలిపెట్టింది. రామచిలుక బతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడూ కోతి వైపు రాలేదు.
కామెంట్‌లు