వైద్య సిబ్బంది సేవలు:--కిలపర్తి దాలినాయుడు

 ఆ.వె.
నాడి పట్టి చూచి-నరమున మందులు
సూది ద్వార గూర్చి-దాదివోలె
ఘడియ ఘడియ జూచు-ఘనమైన సేవలన్
చేయు నర్సు నకును-చేతు నతులు
(ఈ రోజు నర్సుల దినోత్సవం)
ఆ.వె.
వైద్యుడనగనెవరు-వసుధను దేవుండు
వైద్యుడనగ ప్రాణ-వాయువతడు
వైద్యులున్న నాడు-వణకును యముడైన
వైద్య డనగ గాదె-వనజ భవుడు!
తే.గీ.
కారు రక్తంబు జూచిన-కరము చాచి
కట్టుగట్టును మాతయై-కలత మాన్పు
మూడు పూటలు దరిచేరి-మోదమిచ్చి
వెన్ను తట్టెడి వెజ్జుడే-వేల్పుమాకు!
ఆ.వె.
జ్వరము వచ్చెననగ-వణుకును గృహమంత
వచ్చెనని కరోన-పాఱ జూచు
నట్టి వేళనరులు-ముట్టని సమయాన
వైద్య దేవుడొకడె-ప్రాణ మిచ్చు!