నిర్ణయం:-పండుగాయలసుమలత.గొట్లూరు.కర్నూలుజిల్లా.


 కళింగ రాజ్యాన్ని హర్షవర్థనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.

"ఒక రోజు రాజ్యంలో అడవి పందులు ఎక్కువై పంటలను నాశనం చేస్తున్నాయి" అని కొందరు రాజుతో మొరపెట్టుకున్నారు. అందుకు మహారాజు వాటిని అరికట్టడానికి మంత్రితో సమావేశం ఏర్పాటు చేశాడు. మంత్రి దీర్ఘంగా పరిష్కారం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు.మరుసటి రోజు రాజ్యంలో ఎవరైతే పది అడవి పందుల తలలు తెస్తారో వారికి ఒక విలువైనబంగారు నాణెం బహుమతిగా ఇస్తామని చాటింపు వేశారు.ఆ రోజు నుండి వేరు వేరు ప్రాంతాలవారు ఎంతో సాహసంతో చంపిన అడవి పందులను తెచ్చి వారి బహుమతులను తీసుకెళ్తున్నారు.అలా ఖజానాలోపున్న బంగారం అంతా అయిపోసాగింది. అంతటితో పందుల గోల తగ్గలేదు.

ఒక రోజు రాత్రి రాజు,మంత్రి ఇద్దరు మారువేషంలో గ్రామంలోకి బయలుదేరారు.ఒక ఇంటి వద్ద ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు

"ఏరా నీవి ఇంకా పది పందులు కాలేదా? అని ఒకడు అడిగాడు.

"లేదురా! రెండు పిల్లలు ఈ రోజే పుట్టాయి.ఇంకా కొన్ని రోజులు ఆగాలి" అన్నాడు.అంతటితో మరొకడు "నావి పది పందులు పూర్తి అయ్యాయి.రేపే రాజు, వద్దకు వెళ్లి బంగారు నాణేలు తెచ్చుకోవాలి" అన్నాడు.

ఆ మాటలు రాజు, మంత్రి చెవిన పడ్డాయి. రాజుకు అనుమానం వచ్చి తన మంత్రితో కలిసి వారి పెరట్లోకి వెళ్లి చూసారు.అక్కడ పందులకు గుడారాలు కట్టి అందులో వాటి పెంపకం మెదలు పెట్టారు.వాటికి కావలసిన ఆహారం కూడా అక్కడే ఏర్పాటు చేశారు.అది చూసి రాజుకు కోపం వచ్చింది.ఆ మరుసటి రోజు నుండి నాణేలను ఇవ్వడం ఆపేసారు.దాంతో క్రమంగా అడవి పందుల గోల తగ్గింది.