మత్తేభము :
*నిను సేవింపగ నాపదల్పొడమనీ, | నిత్యోత్సవంబబ్బనీ*
*జనమాత్రుండననీ మహాత్ముడననీ | సంసార మోహంబు పై*
*కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ | కుదింపనీ, మేలు వ*
*చ్చిన రానీ యవి నాకు భూషణములే | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నిన్ను పూజించి సేవించడం వలన, నాకు కష్టాలు వస్తే రానీ, నా చుట్టూ ప్రతిక్షణమూ పండుగలు జరుగనీ, ఈ భూమి మీద వున్న కొన్ని కోట్ల మందిలో నన్ను కూడా ఒకడిగా అనుకుంటే అనుకోనీ, నన్ను చాలా గొప్పవాడు అని పొగిడితే పొగడనీ, మోహంతో కూడిన సంసార బంధాలు వస్తే రానీ, భగవంతుని గురించి తెలిసినా తెలియనీ, గ్రహములు అన్నీ నాకు అనుకూలంగా మారనీ, మంచి జరిగితే జరగనీ, ఇవి అన్నీ కూడా నాకు ఆభరణముల వంటివే...అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మా పాపాలను కరగించే లయకారుడవు నీవే మా ప్రక్కన వుంటే, నీ అర్చనలో, ఆరాధనలో మేము మునిగి వుంటే, ఈ భూమి మీద వున్న అన్ని సంపదలూ, మా చుట్టూ వున్నా మాకు ఎటువంటి ఇబ్బంది కలుగదు. ఈ సంపదలు అన్నీ మమ్మల్ని నీనుంచి దూరం వుంచలేవు, శూలపాణీ. నీ రక్షణ లో వున్న మాకు ఏమీ కొరత లేదు కదా, కాత్యాయనీ పతీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి