*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౫ - 15)
 మత్తేభము :
*నిను నావాకిట గావుమంటినో? మరు | న్నీలాలకభ్రాంతి గుం*
*టెన పొమ్మంటినో, యెంగిలిచ్చితిను తిం | టేగానీ కాదంటినో*
*నిను నెమ్మిందగ విశ్వసించు సుజనా | నీకంబు రక్షింప చే*
*సిన నావిన్నపమేల గైకొనవయా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నిన్ను నా గుమ్మంలో కాపలా వుండమని అడగలేదు.  రంభ, ఊర్వశి, మేనక ముదలైన వారి పొందు కోరి నిన్ను దూతగా పంప లేదు. ఎంగిలి చేసిన పండు నీకు భోజనము పెట్టి తినమని బలవంతం చేయలేదు.  నిన్నే నమ్మి వున్న నీ భక్తలను రక్షించు అనే కదా నేను కోరుకుంటున్నాను. వినవెందుకు, స్వామీ!.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నా వాకిట నిను కాపాలా వుంచుకోడానికి, నేను బాణాసురుణ్ణి కాను. నాకు అంత రాక్షసత్వమూ లేదు. నా ఎంగిలి నీకు తినిపించడానికి, నేను తిన్నణ్ణి కాను. అంత అజ్ఞానంతో కూడుకున్న మూర్ఖత్వం లేదు. అలా వుండి వుంటే, నా మూర్ఖత్వ పూజలు మెచ్చే వాడివేమో, పరాత్పరా! కానీ నేను నీ మాయలో వున్నాను. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను కానీ, ఎమీ తెలియదు అని గ్రహించ లేక పోతున్నాను. ఈ జగత్తులో వున్న అందరి శ్రేయస్సు కోరి నేను చేసే ప్రార్థన స్వీకరించి, అందరినీ రక్షించు, నీలకంఠా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss