*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౮ - 18)

 శార్దూలము:
*నీ రూపంబు దలంపగా తుదమొద | ల్నేగాన నీవైనచో*
*రారారమ్మనియంచు చెప్పవు వృథా | రంభంబు లింకేటికిన్*
*నీరన్ముంపుము పాలముంపు మిక ని | న్నే నమ్మినాడంజుమీ*
*శ్రీ రామార్చిత పాదపద్మ యుగళా |  శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
శ్రీ రాముని చేత పూజించ బడిన పద్మముల వంటి పాదాలు నీవి.  అటువంటి నీ మొదలు ఎక్కడ వుంది, చివర ఎక్కడ వుంటుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం ఎంత చేసినా అది వృధా ప్రయాస అవుతుంది.  పోనీ మావల్ల కాదు కదా అని, నీవేమైన రమ్మని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ గురించి చెపుతావా అంటే దానికీ దారి కనిపించటల్లేదు.  ఇంక మేము ఏంచేయాలి.  పాలల్లో ముంచుతావో, నీళ్ళల్లో దింపుతావో, నీ ఇష్టం. నేనేమి చెప్పగలను, శ్రీకంఠా! .....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*అంబికానాథా! రామచంద్రమూర్తి చే పూజింపబడిన నీ పూజ్య పాదాలు చూద్దామంటే, అవి ఎక్కడ వున్నయో మాకు తెలియదు, కనబడవు.  పోనీ,మూడో కన్నుతో ముచ్చట గొలుపుతూ ముక్కంటిగా,  చంద్రుని మోముపై వుంచుకుని చంద్రమౌళి వై, గంగమ్మను జుత్తులో బంధించి గంగాధరుడవై వెలుగుతున్న నీ ముఖ పద్మము చూద్దామంటే, అదీ కనబడదు కదా, శిపివిష్టా! మరి నువ్వేమో, బూది పూసుకుని, పామును ధరించి, త్రిశూలధారివై స్మశానంలో ఊరేగుతూ వుంటావట. మాకు ఎక్కడ కనిపిస్తావు, విష్ణువల్లభా!  నువ్వ వుండే చోటే, అయినా, మరుభూమి అంటే మాకు భయంగదా, ఖట్వాంగా! నీకుగా నువ్వు అనుకుంటే తప్ప మా   కర్మచక్షువులతో నిన్ను చూడడము జరిగేపనా, వ్యుప్తకేశా! నువ్వు మాత్రమే నన్ను రక్షించ గలవు. ఇది నిజం. ఇదే నిజం,నిత్యం, సత్యం.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss