*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౨౧ - 21)

 శార్దూలము:
*రాజార్ధాతురుడైనచో నెచట ధ | ర్మంబుండు? నే రీతి నా*
*నాజాతి క్రియలేర్పడున్? సుఖము మా | న్య శ్రేణికెట్లబ్బు? రూ*
*పాజీవాళికి నేది దిక్క? ధృతి నీ |  భక్తుల్ భవత్పాద నీ*
*రేజంబుల్ భజియింతు రే తెరగునన్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఈ ప్రపంచంలో రాజైన వాడు ధనార్జన మీద ఆశతో వుంటే,  నాలుగు జాతులు వారి వారి పనులు చక్కగా ఎలా చేసుకో గలుగుతారు.  సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనుకునే వాళ్ళకి సుఖము ఎలా దొరుకుతుంది.  వేశ్యలకు ఎవరు దిక్కు.  రాజు తనపని మర్చిపోయి వుంటే ఏ పద్ధతులు సరిగ్గా వుండవు, నులు పద్ధతిలో జరుగవు.  అలాగే, పద్మముల లాగా వుండే నీ పాదములను నీ భక్తులు సరిగ్గా సేవించుకోలేరు కదా.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*వామదేవా! నీ సృష్టి లో రాజ్యాలను ఏలే రాజులు స్మృతి విహీనులై, యుద్ధ కాంత వెంట పరుగిడయతూ, కీర్తి కాముకులై, ధన సమపాదనా పరులైతే, చాతుర్వర్ణాలు నిలకడగా నిలబడ లేవు కదా.  ఎవరికీ రక్షణ, గౌరవం వుండదు.  ఎవరు చేయవలసిన పని వారు చేయలేరు.  ఇంతెందుకు, నీ పరమ భక్తులు ఎవరూ నీ పాద పద్మములను సభక్తికంగా సేవ చేసుకోలేరు.  ఇటువంటి పరిస్థితి లో మమ్మల్ని, నీవు కాక ఇంకెవరు రక్ష. నీవే దిక్కు. అన్యధా శరణన్నాస్తి, త్వమేవ శరణం మమ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు