శబ్ద శక్తి-(సైన్స్ వ్యాసం)-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 శబ్దాన్ని గురించి తెలియచేసే శాస్త్రం Acoustics అంటారు ఆంగ్లంలో.శబ్దం ప్రకంపనాల రూపంలో వాయువు లేక వస్తు కణాల ద్వారా ప్రయాణిస్తుందని తెలుసుకదా! 
        బుధ గ్రహం మీద అసలు వాతావరణమే ఉండదు.అందుకే బుధ గ్రహం మీద ఇద్దరు మనుషులు దగ్గర దగ్గరగా నిలబడి మాట్లాడినా,అరచినా వినబడదు!
         మనిషి 20 నుండి 20000హెర్ట్జ్(hertz)(సెకండుకు ఒక ప్రకంపనని(vibration) ఒక హెర్ట్జ్ అనవచ్చు.) మధ్య శబ్దాన్ని వినగలడు.ఏనుగులు అతిచిన్న,అంటే 10 హెర్ట్జ్ కంటే తక్కువ కూడా వినగలవు!
       శబ్దం మీద జరిగిన అనేక పరిశోధనల్లో శబ్దం  వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని తేలింది.
        ఇంధనాన్ని కాల్చి ఎక్కువ పొగబెట్టి, ఆ పొగ లోకి పెద్ద శబ్దాలను పంపి పరిశీలించారు.పొగ  చెదరి పోవడమే కాకుండాపొగలోని అణువులు కలసిపోయి ముద్దలుగా కిందకు పడిపోవడం శాస్త్రజ్ఞులు గమనించారు.చిన్న కణాలు కూడా దూరంగావిసరి వేయబడ్డాయి!
         అమెరికాలోని పర్ డ్యూ యూనివర్సిటీలో
డా॥ ఇంజ్ హువా(inez hua) ఎక్కువ తరంగాలు గల శబ్దాన్ని నీటిలోకి పంపి నీటిని శుద్ది చేసే ప్రక్రియ కనిపెట్టారు. ఈపద్దతికి cavitation అని పేరు  పెట్టారు. ఈ పద్దతిలో నీటిలో అతి ఉష్ణోగ్రత పుడుతుంది.తద్వారా అందులో హాని చేసే క్రిములు నశిస్తాయి! నీటి నుండి వేరు పడిన ఇతర మూలకాలు కూడా నీటిలో హాని కలిగించే పదార్థాలను నశింప చేస్తాయి! ఈ పద్దతి వలన నీళ్ళను శుభ్రపరచడానికి క్లోరిన్ వంటి రసాయనాలు కలపనక్కరలేదు.ఇతర ద్రవాలు,రసాయనాలను శుభ్రపరచడానికి కూడా ఈ శబ్దశక్తిని ఉపయోగించే పద్దతుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి.
        పందులు మొదలైన జంతువులను మాంసాహారానికి ఉపయోగిస్తారు. మాంసం తీసివేసిన తరువాత ఆ కళేబరాలు కుళ్ళి కొన్ని విష వాయువుల్ని విడుదల చేస్తాయి.అందుకే శబ్ద శక్తితో ఆ కళేబరాల్లో జరిగే రసాయనిక చర్యలు నియంత్రించి,తద్వారా కుళ్ళిన పదార్థాలను ఉపయోగపడే ఎరువులుగా మార్చడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
        మనకి వినబడే శబ్దమే కాకుండా వినబడని శబ్దంకూడా ఉంది,అదే ultrasound దీనిని విపరీతంగా వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు.ప్రకృతిలో గబ్బిలాలు అల్ట్రా సౌండు ఉపయోగించి వస్తువులను,చెట్ల కొమ్మలను గుర్తించగలవు.సముద్రపు లోతుల్ని కొలవడానికి కూడా ఈ వినబడని శబ్దం ఉపయోగిస్తున్నారు.
       శబ్దాలకు ఎంత శక్తి ఉందో తెలుసుకున్నాం కదా!
       ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా మానసిక శాంతికోసం ఎంతో అవసరం.