*సా'ధన'!* (కథ):-...గంగశ్రీ 9676305949

 సారథి సార్: "నరేందర్ "టీ శాట్" ఛానల్ లో ఆన్ లైన్ క్లాసులు వింటున్నావా, లేదా? ఒక్క రోజు కూడా వాట్సాప్ గ్రూపు లో హోం వర్క్ చేసి పంపిస్తలేవు?" ఫోన్లో అడిగాడు సారథి సార్.
నరేందర్: "వింటున్నా సార్!హోంవర్క్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నా. పంపిద్దామంటే మాకు వాట్సప్ ఫోన్ లేదు సార్."
సార్: "మరి మీ నాన్నను కొత్త ఫోన్ కొనిమ్మని  అడుగు"
నరేందర్: "ఫిబ్రవరిలోనే మా అక్క పెళ్లైంది సార్. ఇంట్లో ఉన్న పైసలే గాక మూడు లక్షల రూపాయలు అప్పు చేసి అక్క పెళ్లి చేసిండు సార్ మా నాన్న."
సారథి: "మరి ఎట్ల రా? నీకు కష్టమైతే లేదా!
నరేందర్: "ఐతుంది సార్; ఇంకా మూడ్రోజులైతే కొనుక్కుంటా!"
సార్: "అగో అట్లెట్లా! అప్పులున్నయన్నవు కదా?!"
నరేందర్: "ఔన్సార్, ఎనిమిదో క్లాస్ లోనే ఇబ్బందైందని సమ్మర్ హాలిడేస్ లో ఊర్లో పనికి పోయిన సార్"
సారథి: "ఏం పనికి పోయినవ్ రా?"
నరేందర్: "ఏది దొరికితే అదే సార్; కొన్ని రోజులు వడ్లెత్తడానికి, ఆరబోయడానికి పోతే; ఇంకొన్ని రోజులు పత్తేరడం, కూరగాయలు తెంపడం, మొక్కజొన్న కొయ్యడం, వానాకాలం మొదలైనంక నాట్లేయడం, విత్తనాలేయడం మసాలేయడం పనులకు పోయిన సార్! మొత్తం సెలవులు అరవై నాలుగు రోజులు ఇస్తే అరవై రోజులు పనికే పోయిన సార్. నాలుగు రోజులు అక్క వాళ్ళ ఇంటికి పోయొచ్చిన. రోజుకు మూడువందల కూలి. మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు వచ్చినయ్. అందులోంచి పదివేల రూపాయలతో ఫోన్ కొనుక్కుని, రెండువేలతో బట్టలు, మరో వెయ్యితో కాపీలు, స్టడీ మెటీరియల్ కొంటా, మిగిలిన ఐదు వేలు మా నాన్నకు ఇస్తా సార్!"
సారథి: "వెల్ డన్ నరేందర్; ఇలాగే కష్టపడి చదువు పైకొస్తావు."
నరేందర్: "కష్టపడి కద్సార్ ఇష్టపడి చదువుతా"
సారథి: "వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు! నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తావు!" అని అభినందించి, వీళ్లు మాట్లాడిన వాయిస్ కాల్ స్కూల్ గ్రూపులోనే కాక, విలేజ్, మండల గ్రూపులో కూడా పెట్టడంతో ఎంతోమంది అతణ్ణి మెచ్చుకున్నారు. అధికారులైతే స్వయంగా ఇంటికెళ్లి ప్రశంసించారు!!
నీతి: "సాధించాలన్న తపన ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు!"