గజల్:-సముద్రాల శ్రీదేవి
నీకన్నుల కాటుకలో నలుపుదనము నేనౌతా
నీపెదాలు అద్దుకున్న ఎరుపుదనము నేనౌతా

నీప్రేమకు వర్ణమిచ్చి నీరూపుకు రూపమిచ్చి
అల్లుకున్న నీలోగల తెలుపుదనము నేనౌతా

నీలోనే నిండిపోయి నాలోనే ఉండినట్టి
ఓర్పుతోడ  మేలిమైన వలపుతనము నేనౌతా

గజల్లోన నింపుకొంట వజ్రంగా మలుచుకొంట
పదాల్లోన పాదాల్లో తెలుగుదనము నేనౌతా

పంటిలోనతెలుపుగానుఒంటిలోనఎరుపుగాను
చీకటంత తొలిగించగ వెలుగుదనము నేనౌతా

నీకోసం నావిరహం నీలోనే బాధనిచ్చి
వేగుతున్నవేళలోనపులుపుదనమునేనౌతా

దూరమైన వేళలోన నిన్నుచేరు దారిలోన
నీమాటలు చెవికెక్కని కరుకుదనము నేనౌతా

నీగుండియ లోలోపల నాపైనే ప్రేమచూచి
వెల్లడించ లేనప్పుడు గరుకుదనము నేనౌతా

శ్రీదేవీ నన్నునీవు ఇష్టపడక సతాయించు 
పెరిగినపుడునినుచెరగామొరటుదనమునేనౌతా