విలువైనబహుమతి:-డి.కె.చదువులబాబు

 నెమళ్ళదిన్నె గ్రామంలో జయన్న అనే రైతు ఉండేవాడు.జయన్నకు పెద్దయ్య, సుబ్బయ్య,చంద్రయ్య అనే ముగ్గురు కొడుకులున్నారు.
ఒకరోజు జయన్న ఎద్దులబండిలో పోతుంటే ఎద్దులు గాడిదలఅరుపులకు బెదిరి పరుగందుకున్నాయి.ఎత్తయిన రాయిమీదకు బండిచక్రం ఎక్కి దిగడం వల్ల అదురుకు జయన్న కిందపడ్డాడు. కాలు విరిగింది.తలకు గాయమయింది. ఎవరో పరుగున వచ్చి చెప్పడంతో ముగ్గురు కొడుకులూ వచ్చారు. "బండిలో నాన్నను ఇంటికి చేర్చుదాం" అంటూ ఎద్దులబండి ఎటువెళ్ళిందోనని బండికోసం రెండవకొడుకు దారివెంట పరుగెత్తాడు. పెద్దకొడుకు ఆలస్యం చేయకుండా తండ్రిని భుజంమీద ఎత్తుకుని ఇంటికి చేర్చి మంచంపై పడుకోబెట్టాడు. రక్తమంతా తుడిచి చొక్కా మార్చాడు.
ఎద్దులబండిని కొంతమంది దారిలో ఆపి ఉండటం చూసి రెండవకొడుకు అక్కడకెళ్ళాడు.బండిమీద ఎక్కి, ఎద్దులను అదిలిస్తూ ఇంటిదారి పట్టాడు. తండ్రి దారిలో కనిపించలేదు. ఇంటికి తీసుకెళ్ళారని ఎవరో చెప్పారు. దారిలో వైద్యుడి ఇంటికెళ్లి విషయం చెప్పి బండిలో ఎక్కించుకుని వచ్చాడు.వైద్యుడు పరీక్షించి, తలగాయానికి కుట్లువేసి కట్టుకట్టాడు. విరిగిన కాలును సరిచేసి దబ్బలతో కట్టుకట్టాడు."తలగాయం వల్ల చాలా రక్తం పోయివుంటుంది.మంచి ఆహారం ఇవ్వండి .కాలు కదపకుండా చూసుకోండి" అని చెప్పి ,మందులు ఇచ్చి, తిరిగి కట్టు మార్చవలసిన సమయం చెప్పి వెళ్లిపోయాడు.
చిన్నకొడుకు చంద్రుడు తండ్రి దగ్గరే ఉంటూ సమయానికి ఆహారం, మందులు ఇస్తూ ఆయన మంచిచెడ్డలు చూసుకోసాగాడు. రెండవకొడుకు వైద్యుడు చెప్పిన సమయానికి వెళ్ళి, వైద్యుడిని పిల్చుకొచ్చేవాడు.
కొంతకాలానికి జయన్న గాయం నయమయింది.కాలు కట్టుకుంది. చిన్నకొడుకు సహకారంతో లేచి తిరగసాగాడు.జయన్న పూర్తిగా కోలుకున్నాక ముగ్గురు కొడుకులను పిలిచి "నేను బాగా కోలుకున్నాను. ఈసందర్బంగా మీలో ఒకరికి విలువైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను"అన్నాడు.
వెంటనే పెద్దకొడుకు "నాన్నా!నేను బండికోసం ఎదురుచూస్తూ ఆలస్యం చేయకుండా మిమ్మల్ని నాభుజం మీద ఎత్తుకుని ఇంటికి చేర్చాను.రక్తం శుభ్రంచేసి, గాయంమీద చల్లని తడిగుడ్డ ఉంచి రక్తం గడ్డకట్టేలా చేశాను.లేకుంటే రక్తం ఎక్కువగా పోయి ఇబ్బందిపడేవారు.ఆవిలువైన బహుమతి నాకివ్వడం సమంజసం" అన్నాడు. రెండవకొడుకు సుబ్బయ్య "నాన్నా!నేను ఆలస్యంలేకుండా వెంటనే వైద్యుడిని తీసుకొచ్చి వైద్యం చేయించాను. ఆయన చెప్పిన సమయానికి వెళ్లి పిల్చుకుని వచ్చి కట్లు మార్పించాను. విలువైన బహుమతి నాకే చెందాలి" అన్నాడు. తండ్రి పూర్తిగా కోలుకునే వరకూ దగ్గర ఉండి రాత్రీపగలు ఆయన మంచిచెడ్డలు చూసిన చిన్నకొడుకు చంద్రుడు మౌనంగా ఉండిపోయాడు. తండ్రి చంద్రుడితో"నువ్వేం మాట్లాడకుండా, ఉలుకుపలుకు లేకుండా ఉన్నావు" అన్నాడు.
 "నాన్నా!రక్తం చాలా పోయింది. ఏంజరుగుతుందో, ఈవయసులో విరిగిన కాలు కట్టుకుంటుందో లేదో అని నేను ప్రతిరోజూ చాలా ఆందోళనపడ్డాను. భగవంతుడి దయవల్ల కోలుకున్నావు. మునపటిలాగా తిరుగుతున్నావు. నాకు ఇంతకంటే విలువైనబహుమతి ఏముంటుందినాన్నా!నాకు మీరే విలువైన బహుమతి.నాకు ఏబహుమతీ వద్దు" అన్నాడు. ఆమాటలకు జయన్న కళ్లలో నీళ్లు తిరిగాయి.పెద్దకొడుకు,రెండవకొడుకు సిగ్గుతో తలవంచుకున్నారు.

కామెంట్‌లు