రామోజీరావు అంటే ఏంటో తెలియాలా? ఐతే"ఉన్నది ఉన్నట్టు" చదవాలి!!:-- యామిజాల జగదీశ్

 "పుస్తకానికి టైటిల్ ఏం పెడితే బాగుంటుందా? అని రోజుల తరబడి మధనపడుతుంటే క్షణాల్లో ఈ టైటిల్ (రామోజీరావు - ఉన్నది ఉన్నట్టు) సూచించి నా సమస్యను చిటికెలో పరిష్కరించాడు మా అబ్బాయి రఘువంశి గోవిందరాజు" అని డా. గోవిందరాజు చక్రధర్ గారు "ఎందుకిదంతా" అంటూ తన పుస్తకానికి రాసుకున్న పీఠికలో చెప్పుకోవడం చదివినప్పుడు నాకో విషయం గుర్తుకొచ్చింది. 
శీర్షికలు పెట్టడం ఓ కళే. నాకస్సలు చేతకాదు శీర్షిక పెట్టడం. జెమినీ టీవీలో పని చేస్తున్న రోజుల్లో వార్తలన్నీ సిద్ధం చేసుకున్నాక హెడ్ లైన్స్ కోసం ఎక్కువగా వెలది కృష్ణకుమార్ గారి మీద ఆధారపడుతుండేవాడిని ఎక్కువగా.
సరే విషయానికొస్తాను. చక్రధర్ గారిని దాదాపు ముప్పై ఏళ్ళుగా తెలుసు. ఇద్దరిళ్ళూ విద్యానగర్లోనే ఉండేవి. "ఉదయం"లో  సహోద్యోగులం. ఇద్దరం సాక్షిలో 2012 లో రిటైరయ్యాం. ఆయన వయోపరంగా నాకంటే ఓ మూడు నెలలు పెద్ద. జర్నలిజంలోనైతే ఆయన నాకంటే ఎన్నో ఎన్నెన్నో మెట్లెక్కువ. ఆయనకున్న అనుభవాలతో చూస్తే నేనసలు జర్నలిస్టునని చెప్పుకోవడానికి కూడా తగినవాడిని కాను. పెద్దల ఆశీస్సులతో ఎట్టాగో నెట్టుకొచ్చిన వాడినే తప్ప నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. 
నేను వివిధ పత్రికలలో పని చేసినా ఈనాడు కథాకమామీషు ఆనోటా ఈనోటా వినడమే తప్ప ప్రత్యక్షంగా నాకెలాటి అనుబంధమూ లేదు ఈనాడు పత్రికతో. ఈనాడులో ఓ ఏడాదిపాటు శ్రమిస్తే ఏ వార్తనైనా ఇట్టే రాసేయొచ్చు అనే అభిప్రాయం ఉండేది. అక్కడ పని చేసిన వారు ఎక్కడైనా నెట్టుకురాగలరని అనుకునే వాడిని. అటువంటి ఈనాడు పత్రిక అధిపతి రామోజీరావుగారి గురించి చక్రధర్ గారు రాసిన "ఉన్నది ఉన్నట్టు" పుస్తకం నూటికి వంద పైసలంటే ఎంత నిజమో అంతలా ఈ శీర్షికకు అన్నివిధాలా న్యాయం చేసారాయన. ఎక్కడా అభూత కల్పనలు, అతిశయోక్తులూ లేకుండా ఏక్ దమ్మున  చదివింపచేలా నడిపించారీ పుస్తకాన్ని. 
చక్రధర్ గారు పాఠకుడి సౌలభ్యంకోసం మొత్తం తొమ్మిది ప్రధాన భాగాల్లో ముప్పై ఏడు అధ్యాయాల్లో రామోజీరావుగారి గురించి నడిపించిన కథనం ఎంతో ఆసక్తికరంగా ఉంది. 
ఈనాడులో పన్నెండేళ్ళపాటు నిఘానేత్రాల మధ్య గడిపి చవిచూసిన చేదు అనుభవాలను, రామోజీరావులో స్వయంగా గమనించిన మంచిచెడులను చక్రధర్ గారు సుస్పష్టంగా కళ్ళముందుంచడం విశేషం. 

"రామోజీ మంచి ఆర్గనైజర్ ...అంతే" అంటూ ఈనాడు ఫౌండర్ ఎడిటర్ ఎ.బి.కె. ప్రసాద్ గారిని కలిసి రెండు రోజులపాటు ఇంటర్వ్యూ చేసి ఆయన చెప్పిన విషయాలను అందించిన తీరు చదివితే రామోజీరావుగారి తత్వమేంటో బోధపడుతుంది. విధిలేని పరిస్థితిలో కక్కలేక మింగలేక ఎబికె గారి పేరు ఎడిటర్ గా ఇంప్రింట్ లో వేయకతప్పలేదట రామోజీగారికి. 
"రామోజీ మంచి ఆర్గనైజర్. డబ్బుంది కనుక సంస్థలను నెలకొల్పి వాటిని నిర్వహించుకుంటూ వచ్చారని, అధికారులతో తనకు కావలసిన పనులు చేయించుకోవడంలో ఆరి తేరినవారని, రామోజీకి రచనా నైపుణ్యం ఏమీ లేకపోయినా ఆయనకు సంపాదకుడిగా పద్మవిభూషణ్ ఇచ్చారని, వ్యాపారరీత్యా ఈ గౌరవం దక్కి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదన్న ఎబికె గారి వ్యాఖ్యలను బట్టే రామోజీగారు ఎలా ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. 

"సంస్థలో ఉద్యోగిగా కొనసాగుతున్నంత కాలమే రామోజీ రావు వారిని మిత్రుడిగా చూస్తారని, బయటకు వెళ్ళిన మరుక్షణం నుంచి రామోజీ రావు దృష్టిలో వారు శత్రువులే" అన్న మరొకరి అభిప్రాయం బట్టి రామోజీగారి వ్యక్తిత్వమేంటో గ్రహించవచ్చు. 
ఇంతకీ రామోజీ రావుగారు తను ప్రవచించిన విధంగానే రాగద్వేష రహితంగా నడచుకుంటున్నారా? ఇతరుల విమర్శలు, ఆరోపణలను కూడా అదే స్ఫూర్తితో స్వీకరించగలుగుతున్నారా? అనే రచయిత ప్రశ్నకు సరైన జవాబు ఎట్టి పరిస్థితిలోనూ లభించదనే అనిపిస్తోంది. 
సమ్మెకు ముందు కాలంలో ఈనాడులో ఆరుగురు ఎడిటర్ల టీమ్ ఉండేదట. సమ్మె తర్వాత ఎవరినీ ఎడిటర్ గా నియమించక తానే చీఫ్ ఎడిటర్ గా నాలుగున్నర దశాబ్దాలపాటు ఉన్న రామోజీరావుగారు ఉద్యోగుల జీతభత్యాల విషయంలో తన పంథానే కొనసాగించారట. 
రామోజీరావుగారి వ్యవహారతీరు పక్కనపెడితే ఈనాడులో ఆదివారంనాడు వచ్చే సంపాదకీయాలంటే నాకెంతో ఇష్టం. ఆరోజున సాహిత్య సంబంధ సంపాదకీయాలే ఇస్తారు. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సంపాదకీయాలను బయటిలహవారిపై ఆధారపడతారన్న విషయం ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. శ్రీశ్రీ గారు మరణించినప్పుడు వేటూరి సుందరరామమూర్తిగారు సంపాదకీయం రాయడం విశేషం. అలాగే పుష్కరాల వంటి ప్రత్యేక సందర్భాలలో ఆయా విషయాలపై పట్టున్న పండితులను ఆశ్రయించి మరీ రాయించుకోవడం గమనార్హం.
ఈనాడుతో అనుబంధమున్న కొందరు పాత్రికేయుల మాటలను, సంఘటనలను సందర్భోచితంగా సమర్పించిన చక్రధర్ గారి పాత్రికేయ ప్రజ్ఞకు నిదర్శనం. 
రామోజీరావుగారి గురించి తెలుసుకోవడానికి ఈ "ఉన్నది ఉన్నట్టు" అక్షరాలా ఉన్నట్టుగానే 372 పేజీలలో సాగడం వల్ల చదవడానికి సాఫీగా సజావుగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. 
పాత్రికేయులతోపాటు మిగిలిన అన్ని వర్గాలవారుకూడా ఈ పుస్తకాన్ని చదివి ఇతరులతో చదివించవచ్చు. 
మూడు వందల రూపాయల ఖరీదున్న  ఈ పుస్తకం కావలసిన వారు రచయిత చక్రధర్ గారిని సెల్ నెంబర్ 98498 70250 లో సంప్రతించవచ్చు. 

కామెంట్‌లు