షాడోలు (క్రీనీడలు ) తల్లిదండ్రులు :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
తల్లిదండ్రులు 
దైవం సమములు 
పెంచిన ప్రేమలు 
పంచిన మమతలు కదా ఉమా!

పేదలు సాదలు 
అతి ధనవంతులు 
మధ్య తరగతులు 
ఒకటే కడుపున తీపి ఉమా!

గూటిని గువ్వలు 
తెచ్చే బువ్వలు 
బిడ్డలు రవ్వలు 
కోసం తపనే కదా ఉమా!

శ్రావణ కుమార
సేవకు మొదలుర
కావడి మోసెర
జననీ జనకుల సేవ ఉమా!

తనువుకు మూలము 
పెరిగే వైనము
పెద్దల త్యాగము 
వలెనే జరుగును కదా ఉమా!

విసుగే ఉండదు 
కసిరిన తప్పదు 
ఓరిమి వదలదు 
మననే పెంచుట లోను ఉమా!

లాలలు పోయును 
జోలలు పాడును 
ముస్తాబొసగును 
అమ్మ నాన్నల ముచ్చట ఉమా!

పండుగ రోజులు 
క్రొత్తవి దుస్తులు 
తీయని వంటలు 
బిడ్డల కోసం చేయు ఉమా!

రెక్కల కష్టం 
చేయుట ఇష్టం 
విడువకు కష్టం 
వృద్ధుల నెపుడూ వినుము ఉమా!

మమతల కోవెల 
కట్టకు నువు వెల
ముఖాలు వెలవెల
అగునే పాపం నిజం ఉమా!