రెక్కల ఎలుక ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  ఓ ఎలుకకు పిల్లుల బెడద ఎక్కువయింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకుంది.  చడిచప్పుడు లేకుండా వచ్చి మీద పడి అనేక ఎలుకల్ని  చంపి తింటున్నాయి పిల్లులు.  ఈ ఎలుక ఎలాగోలా తప్పించుకుంటూ బ్రతకసాగింది. కానీ  పిల్లులు మాత్రం తనను వేటాడుతూనే ఉన్నాయి.  ఇక లాభలేదని మహిమగల ముని వద్దకు వెళ్ళింది. భూమి మీద ఉండకుండా  ఆకాశం లో విహరించే విధంగా  పక్షులకున్నట్టు  రెక్కలు ఇవ్వమని అడిగింది. ముని అలాగే ఇచ్చాడు.రెక్కలు వచ్చిన ఎలుక ఆనందంగా  ఆకాశంలో విహరించ సాగింది. ఎక్కడో ఉన్న ఓ గ్రద్ద రెక్కల ఎలుకను చూసింది. రయ్యినా వచ్చి మీదపడబోయింది. దాక్కోవడానికి  స్థలం కూడా లేదాయే. భూమి మీదయితే ఏదో ఒక బొరియలో దాక్కునేది.  
    ఎలాగో తప్పించుకుని భూమిమీద పడింది. భయంతో  ముని దగ్గరకు వెళ్ళింది. రెక్కలు తీసేయమని అడిగింది. ముని విషయమంతా గ్రహించి చిరు నవ్వు నవ్వుతూ రెక్కలు తొలగించాడు. ఇప్పుడు ఎలుకకు హాయిగా ఉంది. ఆపద వచ్చినప్పుడు ఏ రంద్రంలోనో దూరి తప్పించుకుంటూ కాలం గడుపుతుంది.