మనకీర్తిశిఖరాలు గుర్రంజాషువా.:- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు

 ఆధునిక కవులలో అనితర సాధ్యమైన స్ధానం జాషువా గారిది.కవులంతా భావకవిత్వంలో మునిగి తేలుతుంటే సామాజిక భావ విప్లవాన్ని కాంక్షిస్తూ రచనలు చేసిన నవయుగ కవి చక్రవర్తి వీరు.1895సెప్టెంబర్ 28 న వినుకొండలోని మిస్సమ్మతోతలో వీరయ్య,లింగమాంబలకు జన్మించారు.వీరికి ఇజ్రయేల్ అనే సోదరుడుకూడా ఉన్నాడు.తన బాల్యంనుండి అవమానాలు,ఛీత్కారాలు ఎన్నో భరించాడు.వినుకొండ లో విద్య,బాపట్లలో ఉపాధ్యాయశిక్షణ పొందారు.బాపట్ల,వినుకొండ పాఠశాలలో పనిచేసారు.బాల్యంనుండి కవిత్వంపై ఆసక్తి కలిగి ఉండటంతో కావ్యపఠనం చెసారు.తనసహాధ్యాయులైన దీపాలపిచ్చయ్యశాస్త్రి గారితొ జంట కవిత్వం ప్రారంభించారు.అనంతరం జూపూడి హనుమశాస్త్రి,అవధాని కొప్పరపు సుబ్బారావు గార్ల ఆశీస్సులు పొందారు.1910 లో మేరితో బాల్యవివాహం జరిగింది.రాజమండ్రి వెళ్ళి కందుకూరి,చిలకమర్తి గార్ల తొ పరిచయం ఏర్పరచుకున్నారు.జాతీయ ప్రగతిశీల భావజాలంతో వీరు సృష్టించిన సాహిత్యానికి ప్రాచుర్యం లభించింది.సమాజంలోని అసమానతలు, కుళ్లురాజకీయాలను తనకవితల ద్వారా బట్టబయలు చేసారు. రుక్మిణికల్యాణం,చిదానంద ప్రభాతము, ధృవవిజయం, మీరాబాయి, నాగార్జునసాగర్,నాకథ(మూడుభాగాలు)కొత్తలోకం,ముసాఫరులు,ఖండికలు,క్రీస్తుచరిత్ర(దీనికి కేంద్రసాహిత్యఆకాడమి అవార్డు లభించింది.)తన సాహిత్య తపస్సుతో అణగారిన బడుగుల శ్రేయస్సుకే అంకితం చేసిన జాషువాగారి రచనలలో ఎన్నో నూతన ప్రక్రియలు కనిపిస్తాయి.అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ,దేశభక్తిని ప్రభోదిస్తూ వీరు పలు రచనలు చేసారు.
సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా
1919 - రుక్మిణీ కళ్యాణం 1922 - చిదానంద ప్రభాతం. కుశలవోపాఖ్యానం 1924 - కోకి.1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం.1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత.1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు.1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు.1929 - సఖి, బుద్ధుడు,తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం.1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ.
1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల.
1932 - స్వప్న కథ, అనాథ, సింధూరము, బుద్ధ మహిమ, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.
1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, శ్మశానవాటిక,1934 - ఆంధ్రభోజుడు. 1941 - గబ్బిలము. 1945 - కాందిశీకుడు. 1946 - తెరచాటు1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ1950 - స్వయంవర.1957 - కొత్తలోకం.1958 - క్రీస్తు చరిత్ర. 1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు.1966 - నాగార్జునసాగరం, నా కథ.
జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యారు.
గజారోహణ,పౌరసన్మానాలు,గండపెండేరాలు,లతో పద్మభూషణ పురస్కారం పొంది,సాహితీ వినీల ఆకాశంలో ధృవతారగా వెలుగొందారు.
ఆయనకీర్తి శాశ్వితం ఈసుకవి 1971జూలై 24న కళామతల్లి పదసేవకై తరలివెళ్లారు.