మత్తేభము:
*పవిపుష్పంబగు, నగ్నిమంచగు, నకూ | పారంబు భూమీ స్థలం*
*బవు, శత్రుండతిమిత్రుడౌ, విషముది | వ్యాహారమౌనెన్నగా*
*నవనీమండలి లోపలన్ శివ శివే | త్యా భాషణోల్లాసికిన్*
*శివ! నీ నామము సర్వవశ్యకరమౌ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఈ భూప్రపంచంలోని అన్ని శుభాలు యిచ్చే నీ "శివ" అనే పేరును ప్రేమతో పలికే అలవాటు వున్న వాడికి, వజ్రం పువ్వు అవుతుంది నిన్ను పూజించడానికి, అగ్ని మంచు అవుతుంది న౮ పూజకు తయారు అవడానికి, సముద్రము భూమి అవుతుంది నీ పూజ చేసుకోడానికి వీలుగా, అజాత శత్రువు స్నేహితుడు అవుతాడు నీ పూజకు సంభారాలు అందించడానికి, విషము పరమాన్నమే అవుతుంది నీకు నైవేద్యం అవ్వాలని. "శివా" నీ పేరు ఒక్కటి చాలు కదా అన్నటినీ వశం చేసుకోవడానికి......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*శివా! నీ నామం పలుకడంలో వున్న ఆనందం తెలుసిన వాడు, మకరందం రుచి మరిగిన భ్రమరం లాగా నీ పేరునే తలచుకుంటూ బ్రతికేస్తాడు కదా, కారుణ్యధామా! నీ తత్వమే భోళా శంకరం! ఇక నీవు ఇవ్వలేనిది ఏముంది ఈ చరాచర జగత్తు లో. నీ పేరు తలచి నిలబడిన ప్రహ్లాదుని, నిప్పుల నుండి, నీరు నుండి, విషము నుండి, క్రూర జంతువుల నుండి కాపాడావు కదా కరుణామయా! నిన్ను నమ్మి వున్నవారిని నిరతమూ చేయిబట్టి నడిపిస్తావు అనేది నిక్కము కదా, నిత్య కళ్యాణ ప్రియా! నీ నామమే నిత్యం! నీ నామమే సత్యం! నీ నామమే సుందరం! నిన్ను దాటిన తరువాత వున్నది కూడా నీవే కదా, సర్వాతర్యామీ! మరి నీ వశం కానిది ఏమి వుంటుంది, నీకు కానీ, నీ భక్తునికి కానీ. ఎందుకంటే, నీవే చెప్పినట్లు నీవూ నీ భక్తులు వేరు వేరు కాదు కదా, కళ్యాణ గుణ ధామా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి