*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౪౭ - 47)

 మత్తేభము:
*తనువెందక ధరిత్రినుండు నో నం | దాక న్మహారోగ దీ*
*పన దుఃఖాదుల బొందకుండ ననుకం | పాదృష్టి వీక్షించి యా*
*వెనుక న్నీ పదపద్మముల్దలంచుచు | న్విశ్వ ప్రపంచంబు బా*
*సిన చిత్తంబున నుండచేయ గదవే | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఈ భూమి మీద నా ప్రణము వున్నంత వరకూ, నాకు ఏ విధమైన రోగములు రాకుండా చూడు. అలాగే, ఆ రోగాలకు మందులు వేసుకోవడం వల్ల కలిగే బాధ లేకుండా చూడు. ఇటువంటి బాధలు అన్నీ లేనప్పుడు నా మనసును నీ మీద వుంచి, నీ పాదాలకు సేవ చేసుకునే అవకాశం కల్పించు.  అలా నీ పాదాలు పట్టుకుని, నీ సేవ చేస్తూ నిన్ను చేరుకునేటట్లు కరుణించి దీవించు, తండ్రీ!.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*శివా! నీవేమో భోళా శంకరుడివి. మరి మేమో ఏము తెలియని గడుసు వాళ్ళము. అందుకే ఒక కవి అన్నారు, "మా బోటి దీనులు మీ కడకు వచ్చేవారలే! ఇంతో అంతో ముడుపు కట్టి అంతటయ్యను మాయజేసి, లక్షలో మోక్షమ్ము కోరే గడుసు బిచ్చగాళ్ళము! ఒట్టి పిచ్చి వాళ్ళము!" అని.  ఈ జన్మ వున్నంత కాలం మాకు ఎటువంటి బాధలు కలుగకుండా చూసి, నిన్ను కొలిచే దారి కూడా నీవే చూపిస్తే, మేము నిన్ను మరచిపోకుండా నీవే గుర్తుచేస్తూ వుంటే, నీ పాదసేవ చేసాము కదయ్యా అని నీకే చెప్పి, కాలాంతాన మాకు నీవే మోక్షము ఇయ్యి స్వామీ, అని అడిగే అమాయకులము కదా, ధూళీ దర్శన ప్రియా! అందుకని అమ్మా, "కన్నడచేసి, నన్నరమర" చేయవద్దని అయ్యతో మా విన్నపము తెలియచేయి, తల్లీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు