"గురువు గారు పలాని చెట్టు,పలాని ఆకు వైద్యానికి పనికి వస్తుందని వైద్యులు ఎలా తెలుసుకున్నారు?వాటి మీద పరిశోధనలు ఏ విధంగా చెయ్యగలిగారు?"అడిగాడు శిష్యుడు శ్రీముఖుడు.
గురువు మహీపతి చిరునవ్వు నవ్వి ఈవిధంగా జవాబు చెప్పాడు.
"శ్రీ ముఖా, ప్రకృతి మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది,అందుకే నిశితంగా మన చుట్ట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలిస్తే మన సమస్యలకు బోలెడు జవాబులు లభిస్తాయి,నీకు ఇంకా బాగా అర్థమయ్యేందుకు ఒక కథ చెబుతాను"అని చెప్ప సాగాడు.
**********
నల్లమల అడవిలో ఓ పెద్ద చెట్టు,దాని మీద రకరకాల పక్షుల గూళ్ళు ఉన్నాయి.ఒక గూడు రంగుల అడవి చిలుకది.పిల్లలకు తగిన ఆహారం పెట్టి అల్లారు ముద్దుగా చూసుకునేది.గూడును రకరకాల చెట్లనుండి సేకరించిన సన్నటి పుల్లలతో నిర్మించింది.పుల్లలు కొన్ని పచ్చివి.అవి మంచి పచ్చి వాసనతో అడవి చిలుకకు,పిల్లలకు ఎంతో హాయినిచ్చేవి! మరీ వేప పుల్లలు,తంగేడు పుల్లలు,కరక్కాయ పుల్లలు గూటిలో పెట్టినపుడు పిల్లలు మరింత ఆనందంతో 'కిచ కిచ'అంటూ పాటలు పాడేవి!
అడవి చిలుక క్రమేపీ ఆ పుల్లల వైద్య గుణాలు గమనించింది.ఆ చెట్ల పుల్లలతోనే గూడును పటిష్టం చేయసాగింది.ఇలా ఉండగా అదే చెట్టు మీద ఇంకొక కొమ్మ మీద గోరింక గూటిలోని పిల్లలకు ఏదో జబ్బు చేసింది.క్రమేపీ వాటి గొంతుమీద మచ్చలు ఏర్పడ సాగాయి.పిల్లల్ని చూసి గోరింక బాధ పడిపోసాగింది.ఒకరోజు అడవిచిలుక గోరింక బాధ పడటం గమనించింది.దాని బాధకు కారణం అడిగింది అడవిచిలుక.
పిల్లల గొంతు మీద మచ్చలు,వాటి నీరసాన్ని గురించి చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది గోరింక.
"నీవు దిగులు పడకు,నేను కొన్ని చెట్ల కొమ్మల పుల్లల్ని గమనించాను.వాటితో గూడు కట్టుకుంటే నీకు,నీ పిల్లలకు ఏ జబ్బూ రాదు.నన్ను నమ్ము "అని చెప్పింది.
రెండోరోజు పొద్దున్నే అడవిచిలుక గోరింకను తనతో తీసుకవెళ్ళి,తను పుల్లలు సేకరించే చెట్లను చూపించి,ఆ పుల్లలతో గూడు పునర్మించమని సూచించింది.
గోరింక అడవిచిలుక చెప్పినట్లే అయా చెట్ల పుల్లలు సేకరించి,గూడును పుననిర్మించింది.చిత్రంగా మూడోరోజు నుండే గోరింక పిల్లలకు చర్మవ్యాధి నయమైపోసాగింది.గోరింకకు కూడా ఆపచ్చి పుల్లల వాసన ఎంతో హాయినిచ్చింది.
అడవిచిలుక వైద్యానికి గోరింక అనేక కృతజ్ఞతలు తెలిపింది.
***************
"చూశావా ,శ్రీముఖా పక్షులు వైద్యానికి పనికి వచ్చే చెట్లను కనిపెట్టి పిల్లలను రక్షించుకున్నాయి.
తరువాత అనేక మంది వైద్యులు పక్షి గూక్ష్ళను పరిశీలించి వైద్యపరంగా ఉపయోగపడే అనేక చెట్లు,మూలికలను కనిపెట్టి వైద్యం చేయసాగారు.
ఆ విధంగా ప్రకృతే మనకు ఎన్నో నేర్పిస్తుంది.అప్పట్లోతాము గమనించిన చెట్లు,మూలికల్ని గురించి పుస్తకాల్లో వ్రాశారు,అవి ఇప్పటికీ ప్రమాణికంగా ఉన్నాయి"అని చెప్పారు మహీపతి.
"గురువుగారు,మీరు చెప్పింది అర్థం అయింది,ప్రకృతి మనల్ని రకరకాలుగా ఆదుకొంటోంది.అందుకు మనం ప్రకృతిని రక్షించుకోవాలి"చెప్పాడు శ్రీముఖుడు.
"శ్రీముఖా నీవు చక్కగా అర్థం చేసుకున్నావు"అని అభినందించారు గురువు మహీపతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి