విద్యల వెలుగు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  కరివేన గ్రామం లోఏభై కుటుంబాలు ఉన్నాయి,ఓ చిన్న హనుమంతుడి గుడి కొంతదూరంలో అడవి ఉన్నాయి.మరి అక్కడ బడిలేదు.
         కొండయ్య అనే పేద రైతు కూతురు గిరిజ,వారి పక్కింటి అమ్మాయి సరళ ఇద్దరికీ మంచి స్నేహం.
అప్పుడప్పుడూ హనుమంతుడి గుడిలో పక్క ఊరి నుండి హరిదాసు వచ్చి చక్కని పురాణ కథలు హరి కథలు చెప్పేవాడు.ఆ కథలు చెబుతున్నప్పుడు,విద్య ఉపయోగం,విద్య నేర్చుకుంటే వికసించే బుద్ధిని గురించి చక్కగా వివరించే వాడు.
        గిరిజ,సరళ క్రమం తప్పకుండా గుడికి వెళ్ళి హరిదాసు చెప్పే కథలను శ్రద్దగా విని ఇద్దరూ వాటిని గురించి మాట్లాడుకునే వారు.
    ఒకరోజు గిరిజ, వాళ్ళ నాన్నతో తనకు చదువుకోవాలని ఉందని పక్కఊరికెళ్ళి చదువుకుంటానని చెప్పింది.తండ్రి ఈ విధంగా చెప్పాడు.
       "తల్లీ నిన్ను వేరే ఊరికి పంపించేంత స్తోమత నాకు లేదు,మనకు పొలం మీద వచ్చే ఆదాయం అంతంత మాత్రమే,మన కాస్త ఆదాయం మన తిండికే సరిపోతుంది.మంచి రోజులు తప్పకుండా వస్తాయి,నిన్ను చదివిస్తాను"అని చెప్పాడు.
        ఆ మాటలకు గిరిజ సంతోషించింది.
      గిరిజ తండ్రి పొలానికి వెళ్ళాడు. ఇంట్లో వంట చేయడానికి కట్టెలు అయిపోయాయి.గిరిజ తల్లి గిరిజను అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు తెమ్మంది.
గిరిజ,సరళను తోడు తీసుకుని గొడ్డలితో అడవికి వెళ్ళింది.
          ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ  అడవిలోకి వెళ్ళారు.ఓ పెద్ద చెట్టు ఎండిన కొమ్మ కొట్టసాగారు.
కొమ్మ విరిగింది.ఇంతలో పెద్ద గాలి వీచింది! చెట్టు మీద నుండి ఒక ఆడ రాక్షసి వారి ముందుకు దూకింది.
         దానిని చూసి ఇద్దరూ హడలి పోయారు.వాళ్ళ భయం గమనించి ఆ రాక్షసి " భయపడకండి నేను మీకు ఏ హానీ చెయ్యను, ఇలా అడవికి వచ్చి కట్టెలు కొడుతున్నారు,మీరు చదువుకోవడంలేదా?చెప్పండి"అన్నది. దాని మాటలకు ఇద్దరిలో కొంత ధైర్యం వచ్చింది.
         "అమ్మా,మాతల్లిదండ్రులు చాలా బీదవాళ్ళు,చదువుకుందామంటె మా గ్రామంలో బడిలేదు.అందుకే చదువుకో లేక  ఇలా ఇంటి పనులు చేసుకుంటున్నాం,మరి నీవెందుకు భయంకరంగా ఉన్నావు?" అడిగారు.
       "అమ్మాయిలూ నేను కొన్ని వందల సంవత్సరాలక్రితం మనిషినే,అప్పట్లో నా పనిమనిషి ఓ పదేళ్ళ పిల్ల దాని చేత గొడ్డు చాకిరీ చేయించేదానిని,అది చదువుకుంటానంటే దానిని హింసించాను.ఇదంతా ఒక యోగిని గమనించింది,నా హింసాత్మక ధోరణి మానమంది.అయినా నేను ఆ మంచి మాటను పెడ చెవిన పెట్టాను.అందుకే ఆమె నన్ను రాక్షసిగా మారమని శాపం పెట్టింది.నాకు శాప విమోచనం చెయ్యమని ఆమె కాళ్ళపై పడ్డాను"
       "నీవు ఆడ పిల్లకు చదువుకునేట్టు ప్రోత్సహించి చదువు చెప్పిస్తే నీకు ఈ రాక్షసి రూపం పోయి విముక్తి కలుగుతుంది"అని చెప్పింది.
       ఇక నాకు శాప విముక్తి కలిగే సమయం ఆసన్నమయింది. ఈచెట్టు దగ్గర కొన్ని బంగారు నాణేలు పాతి పెట్టి ఉన్నాను,అవి తీసుకుని మీ తండ్రులకు ఇవ్వండి,ఆ ధనంతో మిమ్మల్ని చదివిస్తారు"అన్నది.
       ఎప్పుడైతే ఈ మంచి మాటలు చెప్పిందో అప్పుడే దానికి సగం శాప విముక్తి కలిగింది.ఒక వృద్ధ వనితగా మారింది. ఇద్దరినీ తీసుకుని గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ తండ్రులను కలసి ఈవిధంగా చెప్పింది,"అయ్యా, వీళ్ళిద్దరూ చదువుకోవాలను కుంటున్నారు,ఆడపిల్లకు చదువు ఎంతో ముఖ్యం,ఆడపిల్ల బాగా చదువుకుంటే ఆమె కుటుంబమే కాదు సంఘం కూడా బాగుపడుతుంది.మీరిద్దరూ బీదవారు కనుక నాదగ్గర ఉన్న బంగారు నాణేలు ఇస్తున్నాను,మీపొలాల పై పెట్టు బడి పెట్టండి ఒక మంచి పాఠశాల కట్టించండి,కేవలం వీరిద్దరే కాదు,మిగతా ఆడ పిల్లలు కూడా చదువుకుంటారు.ఊరు బాగు పడుతుంది"చెప్పి బంగారు నాణెలు ఇచ్చింది.ఇద్దరు తండ్రులు ఆశ్చర్య పోయి ఆమె వివరాలు అడగ బోయేంతలో ఆమెకు శాప విముక్తి జరిగి గాలిలో కలసి పోయింది!
       ఆ విధంగా ఊరులో కట్టిన పాఠశాలలో బాగా చదువు కున్నారు గిరిజ,సరళ.
       కొద్ది సంవత్సరాల తరువాత ఇద్దరూ హనుమంతుని మీద,పురాణాల మీద ఎన్నో కావ్యాలు,గద్యం వ్రాసి కరివేన పేరును నిలబెట్టారు.ఆ ఊరు అన్ని విధాల అభివృద్ధి చెందింది.పొలాలు బాగా పండాయి.రాక్షసి మంచి పనులు చేసినా మంచే జరుగుతుంది.
       'లోకా సమస్తా సుఖినో భవంతు'
      

కామెంట్‌లు