ఆదిత్యుడి శాప విమోచనం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

   గురువు మహీపతి వద్ద సమస్త విద్యలు నేర్చుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని సంజయ్,ధీరజ్ లు దేశాటనకు బయలుదేరారు.ఎందుకంటే వివిధ ప్రదేశాలు అక్కడి విశేషాలు,అక్కడి గొప్పవారిని కలసి చర్చించటం విద్యలో భాగమే.
         అలా గుర్రాల మీద పొరుగు రాజ్యానికి అడవిగుండా వెళ్ళసాగారు.తెచ్చుకున్న నీళ్ళు ఆహారం అయిపొయ్యాయి.పక్కరాజ్యం ఇంకా చాలా దూరం ఉంది.వారికి ఆకలి దాహం వేయసాగింది ఆ అడవిలో వారికి నీళ్ళు,పండ్లు దొరకలేదు! 
      అసలే ఎండాకాలం.ఇద్దరూ అటు ఇటు చూసుకుంటూ వెళ్ళసాగారు.
        "ఆగు సంజయ్"అరిచాడు ధీరజ్.
        "ఏమిటి?"అడిగాడు సంజయ్.
         "అటుచూడు"అని ఎండిన చెట్లకొమ్మల మధ్యనుండి దూరంగా కనబడుతున్న ఒక కోట పైభాగాన్ని చూపించాడు.
         సంజయ్ ఆశ్చర్యపోతూ "ఈ అడవిలో కోట ఉన్నట్లు మనం ఎప్పుడూ వినలేదే" అన్నాడు.
         "అవును ఈ కోటను గురించి ఎవరికీ తెలిసినట్లులేదు!" అన్నాడు ధీరజ్.
        "పద ఆ కోటను చేరుకుని చూద్దాం,అక్కడ  బావి ,పండ్లచెట్లు ఉండవచ్చు"అన్నాడు సంజయ్.
        అడవిలో చెట్లు,రాళ్ళను దాటుకుని మెల్లగా ఆకోటను చేరుకున్నారు.కోటలో మనుషుల అలికిడి లేదు! చిత్రంగా నేలమీద కొన్ని సింహాలు మత్తుగా పడుకుని ఉన్నాయి! అక్కడక్కడ ముళ్ళ చెట్లు ఉన్నాయి.
         "ఏంచేద్దామా ?" అని ఆలోచించ సాగారు.
         ఉన్నట్టుండి పెద్దగాలి వీచింది.చెట్లు ఊగాయి! పెద్ద రాక్షస ఆకారంలో ఉన్న మహాకాయుడు ప్రత్యక్షమయాడు.వాడి ఆకారం చూసి సంజయ్,ధీరజ్ లు ఆశ్చర్య పోయారు,ఒకింత భయపడ్డారు కూడా.
          "ఎవరురా మీరు ధైర్యంగా నాకోట దగ్గరకు వచ్చారు?"అని భీకరంగా అడిగాడు.
        "అయ్యా,అసలు కోట ఇక్కడ కోట ఉన్నట్టు  మేము ఎప్పుడూ వినలేదు.మేము విద్య పూర్తి చేసుకుని పొరుగు రాజ్యంలో విశేషాలు తెలుసుకునేందుకు వెళుతున్నాం, అది మా విద్యలో భాగం,మేము తెచ్చుకున్న నీళ్ళు,ఆహారం అయిపొయ్యాయి,ఈ కోటలో నీళ్ళు,పండ్లు దొరుకుతాయని వచ్చాము.మా వలన తమరికి ఏ హానీ ఉండదు"అని ఎంతో నమ్రతతో చెప్పారు.
        "సరే,నా ఆతిథ్యం పొందాలంటే,నాకు మంచి తెలుగు పద్యం తప్పులు లేకుండా చెప్పాలి,అప్పుడే మిమ్మల్ని లోపలికి తీసుక వెళ్ళి  నీళ్ళు,రుచికరమైన ఆహారం పెడతాను.మీరు పద్యం చెప్పలేక పోతే మిమ్మల్ని ఇక్కడనుండి తరిమేస్తాను"అని ఖఠువుగా చెప్పాడు.
    సంజయ్,ధీరజ్ లు వాడి మాటలకు ఆశ్చర్యపోయారు.వారి ఆశ్చర్యాన్ని గమనించిన ఆ మహాకాయుడు ఈవిధంగా చెప్పాడు.
       " కొన్ని వేల ఏళ్ళ క్రితం (క్రీ.పూ.326) నేను ఆదిత్య పేరుతో విశాఖపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండే వాడిని,అప్పుడే అలెగ్జాండర్ అనే గ్రీకు దేశపు రాజు ప్రపంచాన్ని జయించాలని మనదేశం మీదకు దండెత్తి వారి సంస్కృతిని ,భాషను మన దేశం మీద రుద్దసాగాడు.ఆ విధంగా వారు గ్రీకు భాషని మనవాళ్ళకు నేర్పించసాగారు.అప్పటిలో నేనుకూడా గ్రీకు భాషకు ఆకర్షితుడయ్యాను.నేను ఆ భాషను నేర్చుకోవడమే కాకుండా నా రాజ్యం లోని ప్రజలందరూ గ్రీకు భాష నేర్చుకోవాలనీ ఆ భాషలోనే మాట్లాడాలని చట్టం చేసాను.ప్రజలకు అది చాలా కష్టమైపోయింది! 
         నా రాజ్యంలో శంతనుడనే కవి సంస్కృతం లోనూ,తెలుగులోనూ ఎన్నో పద్యాలు,కావ్యాలు వ్రాశాడు.ఈ సంగతి తెలిసి ఆయనను పిలిపించి సంస్కృతంలో,తెలుగులో గ్రంథాలు వ్రాయవద్దని కేవలం గ్రీకు భాష నేర్చుకుని ఆ భాషలోనే గ్రంథాలు వ్రాయమని చెప్పాను"
        "మహారాజా పరభాష మీద మోజు ఉండవచ్చు,వివిధ భాషలు నేర్చుకోవచ్చు,నిజానికి వివిధ భాషలు నేర్చుకుంటే  మేధస్సు కూడా వికసిస్తుంది.కానీ మన భాష మన పురాణ భాషల్ని మరచి పోకూడదు.మాతృభాషలోని మాధుర్యాన్ని అనుభవించాలి,మాతృ భాష అభివృద్ధికి పాటు పడాలి"అని నాకు వివరించాడు.
        ఆయన మంచి మాటలు నాచెవికెక్కలేదు.కోపంతో నీవు గ్రీకు భాషలో తప్ప వేరే భాషలో వ్రాస్తే నీ కుడి చెయ్యిని నరికేస్తాను" అని క్రూరంగా చెప్పాను.
           "అప్పుడు ఆ మహానుభావుడు కోపంతో నన్ను మాతృ భాష ద్రోహిగావర్ణించి ఘోరంగా శపించాడు.ఈ విధంగా..."
       "నీవు మాతృభాష గొప్పదనాన్ని మరచి పరభాషా వ్యామోహం లో పడి పోయావు,అందుకే నీవు నీ రూపాన్ని కోల్పోయి భయంకొలిపే భీకర రూపం పొందుతావు,దాని వలన నీవు మానవుల మధ్యకు వెళ్ళలేవు,నీ కోట చుట్టూ నగరం మాయమై పోయి,అడవిగా మారిపోతుంది.ఆ కోట కూడా చాలా ఏళ్ళు ఎవరికీ కనబడకుండా చెట్లు పెరిగి పోతాయి.ఎవరైనా వారంతటికి వారే నీ దగ్గరకు వచ్చి  తెలుగు పద్యాలు చెబితే నీకు మాతృభాషను కించ పరిచిన పాపం పోయి,శాప విముక్తి కలుగుతుంది"వివరించాడు.
    సంజయ్,ధీరజ్ లు ఆదిత్యుడు చెప్పిన విషయాలు విని "అయ్యా ,మీకు మంచి పద్యాలు చెబుతాము అని ధీరజ్  మొదట ఈ సరస్వతీ దేవి పద్యం చదివాడు.
        తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్
        బూనితిన్ నీవు యల్లంబందున నిల్చి
        జృంభణముగా నుక్తుల్ సుశబ్దమ్ము శో
        భిల్లంబల్కుము నాదు వాఖ్కునను సంప్రీతిన్
        జగన్మోహినీ పుల్లాబ్జాక్షి,! సరస్వతీ!
       భగవతీ! పూర్ణేందు బింబాననా!
 తరువాత సంజయ్ ఈ పద్యం చదివాడు.
        ఒక వ్రేలు పిడికిలగునా?
       ఒక చేతను చేయు పనులు నొరవు నగునా
        ఒక చెట్టు తోట యగునా?
        ఒక డాడిన మాటయందు నొప్పునె సుమతీ.
మరలా గాలి వీచింది,ఆ మహాకాయుడు తన రూపం కోల్పోయి ఒక మానవ  ముసలి రాజు రూపం సంతరించుకున్నాడు.కోట చుట్టూ ఉన్న ముళ్ళ కాయలు మంచి రంగుతో తినే కాయలుగా మారి పోయాయి!పడుకున్న సింహాలు ఆవులుగా మారి పొయ్యాయి.చుట్టూ చెట్లు దట్టంగా కనబడ సాగాయి.పక్షుల కిల కిల రావాలు వినబడ సాగాయి.కోటచుట్టూ అడవి మాయం అయి ఒక పురాతన నగరం కనబడింది!
       అదిత్యుడికి శాప విముక్తి జరిగి పోయింది.ముసలి రూపంలో ఉన్న ఆదిత్యుడు ఇద్దరినీ ఆశీర్వదించి,"నాయనలారా, రండి మొదట భోంచేయండి" అని కోటలోపలికి తీసుక వెళ్ళి షడ్ర సోపేత భోజనం పెట్టాడు.గుర్రాలకు నీళ్ళు,పచ్చి గడ్డి పెట్టాడు.
        "ఇక వెళ్ళి పోతున్నాను,మీ మాతృభాష వలన నాకు శాప విమోచనం కలిగింది,మాతృ భాషను మరవకండి, కోటలో ఉన్న సంపద మీకే,మంచి గ్రంథాలయం కట్టించండి,భాషా సేవ చేయండి"అని చెప్పి పొగ రూపంలోకి మారి ఆకాశంలోకి వెళ్ళి పోయాడు.సంజయ్ ,ధీరజ్ లు ఒకింత బాధతో ఆ పొగ వైపు చూస్తుండి పోయారు.
        కోటలోని బంగారం గుర్రాల మీద వేసుకుని అనేక మంచి పనులు చేయడానికి వెళ్ళి పోయారు.