పొద్దున లేస్తూనే ఒక చుక్క కాఫీ లేక కొందరికి టీ పడకపోతే మహానీరసం. మనసు గిల గిల లాడి పోతుంది.ప్రపంచమంతా కాఫీ,టీ ప్రియులు ఉన్నారు.
వీటికి పెద్ద చరిత్రే ఉంది.ఒకప్పుడు ఇవి తాగితే అనారోగ్యం అనుకునే వారు.అప్పట్లో గాంధీజీ ఆరోగ్యం మీద ఒక పుస్తకం వ్రాశారు.అది'ఆరోగ్యమునకు మూల సూత్రము'(A guide to health).అందులో ఆయన కాఫీ,టీ,కోకోలు ఆరోగ్యానికి మంచివి కావని తాగే వారు వాటిని మాని వేయాలని వ్రాశారు!
కానీ కాలక్రమేణా కాఫీ,టీల మీద పరిశోధనలు జరిగిపోయి అవి ఆరోగ్యానికి మంచివే అని శాస్త్రజ్ఞులు తేల్చేశారు.కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. కాఫీ కొంచె ఘాటుగా ఉండటానికి ఇదే కారణం. ఈ కెఫీన్ నరాలను ఉత్తేజపరుస్తుంది,అందుకే కాఫీ త్రాగితే హుషారు వస్తుంది.ఎక్కువగా తాగితే నిద్రరాదు.
కాఫీ,టీలలో పోలీ ఫెనాల్స్ అనే రసాయనాలు ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి మంచివి.కాన్సర్ కు
గురి కాకుండా రక్షిస్తాయి!మెదడు పనితనం మెరుగు పరుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.మరి కాఫీ పంట మన దేశంలో కర్ణాటకలో ఎక్కువ పండుతుంది.కాఫీ గింజలలో వాటి మేలురకం బట్టి అనేక తరగతులుగా విభజించారు.
ప్రపంచంలో ఎక్కువ కాఫీని పండించే దేశం బ్రెజిల్. మన దేశంలో కాఫీ పరిశోధన కేంద్రం కర్ణాటక లోని మైసూర్ లో ఉంది. కాఫీ చరిత్ర,దాని ఉపయోగాలు,ఏవిధంగా చెయ్యాలో,కాఫీలో రకాలను గురించి బోలెడు పుస్తకాలు ఉన్నాయి! అందులో ఒక పుస్తకం మీకోసం 'coffee-a global history'దీని రచయిత జోనాథన్ మారీస్.
మరి ఖరీదైన కాఫీ సంగతి తెలుసా? Kopi Luwak అనే రకం ఒక కప్పు కాఫీ ఖరీదు వంద డాలర్లు! అంటే మన రూపాయల్లో ఏడువేల నాలుగు వందల ఏభై ఆరు రూపాయలు!ప్రస్తుత డాలరు రేటు ప్రకారం!
ఏది ఏమైనా 'అతి సర్వత్ర వర్జయేత్' అన్నట్టు రోజుకు ఐదు కప్పలను మించి తాగడం అంత మంచిది కాదు.ప్రపంచంలో ఫిన్లాండ్ వారు ఎక్కువ కాఫీ తాగుతారట!
క్రీ.పూ. చైనా చక్రవర్తి షెన్ నుంగ్ ఓ చెట్టు కింద వేడి నీరు తాగుతుంటేఅందులో ఎగిరి వచ్చి పడిన ఆకులతో టీ తయారయిందని చరిత్ర చెబుతోంది.టర్కీ వారు ఎక్కువ టీ త్రాగుతారట!
టీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నిజానికి కాఫీ కంటే టీ ఆరోగ్యకరం,పాలు కలపని గ్రీన్ టీ మరీ ఆరోగ్యం.టీలో కూడా పోలీ ఫెనాల్స్ ఉంటాయి.కాఫీలో కంటే టీలో కెఫీన్ తక్కువ ఉంటుంది.
టీ కానీ,గ్రీన్ టీకానీ మెదడు పనితీరును ఉత్తేజ పరుస్తుందని,నోటి దుర్వాసన తగ్గిస్తుందని,అనవసరమైన కొవ్వు కరిగిస్తుందని,గుండెకు మంచిదని పరిశోధనలు తెలియచేస్తున్నాయి!కానీ పాలు కలిపిన టీలో చక్కెర ఎక్కువ వేసుకోకూడదు.చక్కెరతో టీ రుచి పోతుంది.ఆరోగ్యానికి చక్కెర అంత మంచిది కాదని తెలుసుకదా!
గ్రీన్ టీ మధుమేహానికి, గుండెకు చాలా మంచిది.
1774 లో అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వారన్ హేస్టింగ్స్ చైనా నుండి టీ విత్తనాలు తెప్పించి,అస్సాము ప్రాంతంలో టీ తోటలు ప్రారంభించాడు.మన దేశంలో అధికంగా టీ పండించే రాష్ట్రం అస్సామే,కర్ణాటక లో కూడా టీ తోటలు ఉన్నాయి.అస్సాం టీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది.
టీ పరిశోధన కేంద్రం కూడా అస్సాం లోనే ఉంది. టీ మీద కూడా బోలెడు పుస్తకాలు ఉన్నాయి.మరి ఒక పుస్తకం చూద్దాం,'The story of tea cultural history and drinking guide'దీనిని వ్రాసింది Mary lou heiss మరియు Robert heiss.
టీ చెయ్యడం ఒక కళాత్మక ప్రక్రియ అని చెప్ప వచ్చు.అందుకే కొంతమంది టీ పెడితే అధ్బుతంగా ఉంటుంది,మరో కప్పు తాగాలనిపిస్తుంది.టీలో మసాలాలు ,లేక కేవలం అల్లం,లవంగం కలిపి కాచి ఆస్వాదించవచ్చు.జపాన్ వారు గ్రీన్ టీ ఎక్కువ తాగుతారుఅందుకే అక్కడ శతాధిక వృద్ధులు అధికం.
ప్రపంచంలో అతి ఖరిదైన టీ 'ద హాంగ్ టీ'. ఇది చైనాలోని వూయి కొండల్లో పండుతుంది.దీనిని క్రీ.శ. 1368 ప్రాంతాలలో మింగ్ రాజవంశస్తులు పండిచినట్టు చరిత్ర చెబుతోంది.ఒక జగ్ టీ ఖరీదు 7.3 లక్షల రూపాయలు.ఈ టీ తయారీ సూత్రాన్ని చైనా వారు అతి రహస్యంగా దాచి పెట్టారు!
ఇంత మంచి కాఫీ,టీ లను ఆస్వాదించండి,రుచిని ఆరోగ్యాన్ని హాయిగా అనుభవించండి.
కాఫీ,టీ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి