దేవత ప్రణాళిక:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  గిరిపురంలో కృష్ణయ్య చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.కృష్ణయ్య ఎక్కడ పొదుపు చెయ్యాలో అక్కడ పొదుపుచేసేవాడు.
తన చేతనైనంతలో అవసరమున్నవాడికి సహాయ పడేవాడు.
      గిరిపురంలో కొందరు అతి దుబారా మనుషులు.
డబ్బేకాదు,నీళ్ళనుకూడా ఇష్టమొచ్చినట్టు వాడేవారు.ఒకటి రెండు సార్లు కొంతమందికి నీళ్ళు పొదుపుగా వాడమని చెప్పాడు.కృష్ణయ్య మాటను ఎవరూ పట్టించుకోలేదు..
      ఒకరోజు కృష్ణయ్యకు కలలో ఆ ఊరి గ్రామ దేవత కనిపడి ఊరి వాళ్ళలో మార్పు తీసుక రావడానికి కృష్ణయ్య ఏం చేయాలో వివరించింది.అంతే మూడు రోజుల తరువాత అందరి బావుల్లో నీళ్ళు అడుగంటి పోసాగాయి.చిత్రంగా కృష్ణయ్య ఇంటి బావిలో మటుకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి.ఈ విషయం తెలిసి ఊరిలోని వాళ్ళు కృష్ణయ్య ఇంటికి వచ్చి నీళ్ళివ్వమని అడిగారు.కృష్ణయ్య వారితో ఈ విధంగా చెప్పాడు.
        "చూడండి, అప్పట్లో బావి చాలా లోతు తవ్వించాను.దానికి చాలా ఖర్చు అయింది.అందుకే మీరు బిందె నీరు తీసుకోవాలంటే బిందెకు రెండు రూపాయిలు ఇవ్వాలి" చెప్పాడు.
      కృష్ణయ్య బుద్ధికి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు.అయినా అవసరం వాళ్ళది కనుక  బిందెకు రెండు రూపాయల చొప్పున చెల్లించి నీళ్ళు తీసుక పోసాగారు.డబ్బు పెట్టి కొంటున్నారు కాబట్టి నీటిని పొదుపుగా వాడటం మొదలు పెట్టారు!
        ఒక సంవత్సరం తరువాత  కృష్ణయ్య తను నీళ్ళు అమ్మగా వచ్చిన డబ్బుతో అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో బావి తవ్వించాడు.
బావి పనులు పూర్తి అయిన తరువాత  కృష్ణయ్య బావి దగ్గరే గ్రామాధికారి సహాయంతో ఒక సభ పెట్టి ఈ విధంగా ప్రజలకు చెప్పాడు.
       "మన భవిష్యత్తుకోసం మనం తగిన విధంగా పొదుపు చెయ్యాలి,పొదుపు అంటే కేవలం డబ్బేకాదు,ప్రకృతి వనరులు అంటే నీళ్ళు,ఇసుక,భూమిలో లభించే ఖనిజాలు ఇవి భావి తరాల వారికి కూడా ఉపయోగ పడాలి కదా!మనం సృష్టించలేని ఈ వనరుల్ని అతి జాగ్రత్తగా వాడాలి,పొదుపుగా వాడాలి.అందుకే మీకు నీటి విలువ తెలియాలని మీ దగ్గర బిందెకు రెండు రూపాయలు వసూలు చేశాను.మీ రందరూ అప్పటినుండి మీరందరూ నీళ్ళు పొదుపుగా వాడారు.అది సంతోషించదగిన విషయం.పోతే మీరు బిందెకు రెండు రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులు పొదుపు చేసి ఈ బావి తవ్వించాను.ఇకనైనా నీళ్ళు పొదుపుగా వాడండి,నీటి విలువ తెలుసుకోండి ఈ నీళ్ళ కోసమే దేశాల మధ్య,రాష్ట్రాల మధ్య యుద్ధాలు వచ్చాయి.ఆలోచించండి"చెప్పాడు కృష్ణయ్య.
        గ్రమాధికారికూడా కృష్ణయ్య సూచనలు పాటించమని ప్రజలను కోరాడు.ప్రజలందరికీ నీటి పొదుపు మీద అవగాహన కలిగింది.
      ఆ రోజు రాత్రి దేవత కృష్ణయ్య కలలో కనబడి తాను చెప్పిన ప్రణాళిక పాటించి ప్రజలలో మార్పు తీసుకవచ్చి నందుకు కృష్ణయ్యను ఆశీర్వదించి మరిన్ని మంచి పనులు చేసే అవకాశం కల్పించింది.ఊరిలో అన్ని బావుల్లో నీళ్ళు వచ్చాయి.