"ఒక పెన్ను, ఒక పుస్తకం, ఒక ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని మార్చగలరనే" మలాలా మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం. బాలికల విద్య, హక్కుల కోసం తెగువ చూపిన మలాలా ఉద్యమకారిణి, చదువు కోసం ప్రాణం పెట్టే యోధురాలు, బాలికల హక్కుల కోసం తపించే కార్యకర్త, మానవతా వాది. ఆడ పిల్లలు కూడా మనుషులే వారికి హక్కులుంటాయి వారు కూడా చదువుకోవాలి. అన్ని రంగాల్లో సత్తా చాటాలి అంటూ ప్రపంచంలోనే ఆడ పిల్లల, చిన్న పిల్లల చదువుల కోసం, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన, చేస్తున్న మలాలా పూర్తి పేరు మలాలా యూసఫ్ జాయ్. పాకిస్థాన్ లోని స్వాత్ జిల్లాలో 12 జులై 1997న, టూర్ పెకాయ్ యూసఫ్జాయ్(తల్లి), జియావుద్దీన్(తండ్రి) లకు జన్మించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి గా చరిత్ర సృష్టించింది. ఉగ్రవాదులు హత్యాయత్నం చేసినా కోలుకొని బాలికల విద్య కొరకు పోరాడి ధైర్యంగా ‘మా చదువుల హక్కు ఆపడానికి మీరు ఎవరు అని ఉగ్రవాదులను గొంతెత్తి ప్రశ్నించింది. పాకిస్థాన్ ప్రభుత్వం మొదటగా పాకిస్థాన్ యూత్ పీస్ ప్రైజ్ బహుకరించింది. అతి చిన్న వయసులోనే ‘ఐ యామ్ మలాలా’ అనే పుస్తకంలో మలాలా ఆత్మ కథ రాసింది. అది ఇంటర్నేషనల్ బెస్ట్ బుక్ సెల్లర్‌గా రికార్డు సృష్టించింది. 18 లక్షల కాపీలు అమ్ముడు పోవడంతో 22 లక్షల పౌండ్ల సొమ్మును సంపాదించింది. దానిలో నుండి 70 శాతం సొమ్మును బాలికల చదువు కోసం కృషి చేస్తున్న సంస్థలకు ఆమె రాసిచ్చింది.
టివి చూడకూడదని, చదువుకోకూడదని షాపింగ్‌లకు వెళ్లకూడదని తాలిబాన్‌లు నిబంధనలు పెట్టారు. దీనితో చాలా మంది అమ్మాయిలు చదువు, బయటికి రావడం మానేశారు. ఆడపిల్లలు బడికి వెళ్ళకూడదు అని, ఒకవేళ వెళితే ఆడ పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు. దీనితో దాదాపు 50 వేల మంది బాలికల చదువు ఆగిపోయింది. మాలాలా మాత్రం ఇంటి దగ్గరే ఉండి చదువుకునేది. గుల్మకాయ్ పేరుతో బీబీసి చానల్‌కు బ్లాగ్ ద్వారా అప్పుడు తాలిబన్ల ద్వారా తాము పడుతున్న కష్టాలను, బాధలను రహస్యంగా ఒక డాక్యుమెంటరీ అందించింది . దీనితో అక్కడి తాలిబన్లకు శత్రువుగా మారింది. 9 అక్టోబర్ 2012లో తీవ్రవాదులు బస్సులో స్కూలుకు వెళుతున్న మలాలా తల పైన కాల్చారు అప్పుడు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయి, తర్వాత బ్రిటన్‌లో చికిత్స అనంతరం కోలుకొని, తన ప్రాంతంలో ఉన్న బాలికల చదువు హక్కుల పోరాటాన్ని అంతర్జాతీయం చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాలలో బాలికల చదువుల హక్కుల కొరకు పోరాటం మొదలు పెట్టింది. 2013లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో బాలికల హక్కుల గురించి, చదువు గురించి మాట్లాడుతూ, ‘అందరూ పుస్తకం పెన్ను పట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధాలు అవే అని చెప్పింది. ఈ ప్రసంగం తర్వాత ఐక్యరాజ్య సమితి మలాలా జన్మించిన రోజున మలాల్ డే గా ప్రకటించింది. 2014 సంవత్సరంలో ప్రపంచంలోని అత్యున్నత బహుమతి నోబెల్ శాంతి బహుమతిని మన దేశానికి చెందిన కైలాష్ సత్యార్థితో కలిసి అందుకున్నారు. అప్పటికి మలాలా వయసు 17 సంవత్సరాలు మాత్రమే. అత్యంత చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న అమ్మాయి గా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాదు పాకిస్థాన్ నుండి నోబెల్ బహుమతి పొందిన రెండో వ్యక్తి గా ప్రసిద్ధి కెక్కింది. ఆమె ఉన్నత విద్య కోసం ఇంగ్లాండు వెళ్ళింది. 2018లో మలాలా పాకిస్థాన్ కి తిరిగి వచ్చి తన స్నేహితుల్ని కలుసుకుని అమితానందం పొందింది. గ్రేటా తన్ బర్గ్, మలాలా వంటివారు చిరుప్రాయంలోనే పర్యావరణ పరిరక్షణ, బాలికల సాధికారత, తదితర అంశాలపై పోరాడటం శుభ పరిణామం.నేటి కరోనా కాలంలో బాల్య వివాహాలు
ఎక్కువగా జరుగుతున్నాయని
యునెస్కో ఆందోళన వ్యక్తం చేస్తుంది.ఆడ పిల్లల తల్లి తండ్రులు మలాలా వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని
తమ పిల్లలు ఉన్నత విద్యని
చదివేందుకు ప్రోత్సహించాలి.
(జూలై 12, మాలాలా డే సందర్భంగా)
మలాలా స్ఫూర్తితో;;; :--- ఎం.రాం ప్రదీప్-9492712836
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి