మహాత్మా గాంధీ తన ఆత్మకథలో తన బలహీనతలని
గురించి వివరించారు. ప్రతి మనిషిలో కొన్ని బలాలు, మరికొన్ని బలహీనతలు ఉంటాయి.ఒక మనిషి తనకున్న బలహీనతలని ఏ విధంగా అధిగమించాడనే విషయంపైనే అతని విజయం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో
ఇదే ముఖ్యమైన విషయం.ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు సమాజానికి ఏ మేరకు ఉపయోగపడ్డాయో అనేది కూడా కీలక విషయంగా చెప్పుకోవాలి.
మహనీయుల గురించి సమాచారం తెలుసుకోవాలంటే
మనకి వికీపీడియాలో దొరుకుతుంది. ఇందులో పూర్తి
సమాచారం దొరకకపోయినా
మనకి కొంత అవగాహన కలుగుతుంది. అయితే గొప్ప
గొప్ప వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని వికీపీడియాలో దొరికే సమాచారం ఆధారంగా
అంచనా వేయలేము.
దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. వారిలో కొందరు పేరు ప్రతిష్టలు ఆశించలేదు.మరికొందరి చరిత్ర
రికార్డ్ అవ్వలేదు. ఇంకొందరికి
తగిన గౌరవం దక్కలేదు. నిన్నమొన్నటి వరకు సావిత్రి బాయి పూలే గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు.
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ కి కూడా 1990 తర్వాతే గుర్తింపు వచ్చింది.భారత దేశం నా మాతృభూమి ప్రతిఙ్ఞ రచయిత
పైడిమర్రి వెంకట సుబ్బారావుకి
సరైన గుర్తింపు లభించలేదు.
చరిత్రలో ఎందరో బహుజన వైతాళికులు గొప్ప గొప్ప
పనులు చేశారు.వీరి చరిత్ర పెద్దగా రికార్డ్ అవ్వలేదు.దేశానికి అనేకమంది
ముస్లిం యోధులు తమ అమూల్యమైన సేవలు అందించారు.ప్రముఖ రచయిత
సయ్యద్ నజీర్ అహ్మద్ అనేకమంది ముస్లిం యోధుల గురించి రాసారు.ఇటీవల ఆయన దేశ తొలితరం ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం గురించి రాశారు.
కథ, కవిత, నవల తదితర ప్రక్రియలకి ఎక్కువగా పురస్కారాలు ఇస్తుంటారు.వీటిపై తరచుగా పోటీలు నిర్వహిస్తుంటారు.సాహిత్యం లో అన్ని ప్రక్రియలు ముఖ్యమైనవే. అయితే జీవిత చరిత్రలు రాసేటప్పుడు రచయిత కొంత అదనపు శ్రమ తీసుకోవాలి. సమాచారం కచ్చితంగా ఉండాలి. ఫోటోల సేకరణ మరొక ఎత్తు.
జీవిత చరిత్రలలో సృజనాత్మకత తక్కువగా ఉండదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.జీవిత చరిత్ర అనేది రాబోయే తరాలకి
ఆదర్శంగా ఉంటే చాలు. విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా
ఉండాలి. అనేకమంది గొప్పవారు కూడా వారికంటే ముందుతరంలో ఉన్న గొప్పవారి గురించి చదివి స్ఫూర్తి పొందినవారే.ఇటువంటి స్పూర్తి నేటి తరాలకు అవసరం.అందుకు జీవిత చరిత్రలని రాసేవారిని ప్రోత్సాహించాలి. వారికి తగు రీతిలో గౌరవాన్ని ఇవ్వాలి. లేనట్లయితే గాంధీ కంటే గాడ్సే గొప్పవాడని నమ్మే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.స్వాతంత్రం వచ్చి వచ్చే ఏడాదికి 75 ఏళ్ళు అవుతుంది. దేశంలో ఎంతో మంది మహనీయులు,సంఘ సంస్కర్తలు, గొప్ప రచయితలు, శాస్త్రవేత్తలు జన్మించారు.వీరిలో కొందరికే తగిన గౌరవం లభించింది.చరిత్ర విస్మరించిన గొప్పవారిని స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదు.అందుకోసం
జీవిత చరిత్రల రచయితలని ప్రోత్సాహించాలి.మహనీయుల పేరుతో పురస్కారాలు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వాలు
అమలు చేస్తున్న పథకాలకి వారి పేర్లు పెట్టాలి.మహనీయుల జీవిత చరిత్రలని విద్యార్థులకి ఉచితం గా అందించాలి.అప్పుడే వారికి
మనం ఘనమైన నివాళి అర్పించినట్లౌతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి