జోగిని.:-రాము కోలా.దెందుకూరు.ఖమ్మం.9849001201.
ఓలమ్మీ!
ఇదేమి శాపమే?
నాలుగు అచ్చరం ముక్కలు నేర్పించి
ఓ అయ్యకిచ్చి బిడ్డకు మనువు చేయాలని
కొండమీది గౌరమ్మకి
ఊర్లోని ముత్తేలమ్మకి
పొలిమేర చివరి పోలేరమ్మకు 
ముడుపులు మీద ముడుపులు 
కట్టినావుగందా?

ఈడొచ్చిన బిడ్డ గడప దాటితే
పాడు కళ్ళు అన్నీ బిడ్డపైనే ఉంటాయని
గుడెసెలోనే పసుపు నీళ్ళు తానం సేయించి...
కులపోల్లని కూడా పిలవక
గుట్టుచప్పుడు కాకుండా బిడ్డను సాపనెక్కించి....ఏసందడీ సేయలేకపోతినని
నీలో నువ్వు కుమిలిపోతివి
ఉన్నంతలో బిడ్డ అచ్చటా ముచ్చటా సూసుకుంటూ
రేపోమాపో ఓ ఇంటిదాన్ని సేయాలని సూత్తుంటే!


ఏ మాయదారి సూపులకు సిక్కిందో
గడప దాటని బిడ్డఊసు దివాణం సేరింది
సీరా సారే గడప తట్టింది.
దొరగారి తీర్పు ఊరు నలుదిశలా పాకింది
రత్తాలు బిడ్డను అమ్మోరు జోగినిగా కోరిందంటూ!

ఇదేం ఇడ్డూరమే తల్లీ!
ఊర్లో ఇంతమంది దొరబిడ్డలుంటే
అమ్మోరి సూపు గుడిసెలోని మంగిని చేరిందా?
గ్రామంలో దళిత బిడ్డ తప్ప 
జోగినిగా ఎవ్వరూ పనికిరారా!
ఇడెక్కడి చిత్రమే తల్లీ?

ఓ అయ్యసేతిని అట్టుకొని ఇల్లాలిగా ఎల్లాల్సిన బిడ్డ
నలుగురి సేతుల్లో పడి నలగాల్సిందేనా?
జీవితాంతం గ్రామానికి దత్తగా ఉండాల్సిందేనా?
ఇదేం ఆసారమే తల్లీ!

ఏదిక్కూ లేనోళ్ళకి ఆదేవుడే దిక్కంటారు గందా...
ఈ మడుసులు ఆదేవుని పేరు సెప్పుకొని ఆదిక్కూ లేకుండా సేత్తన్నారు..
ఇదేం నాయమే తల్లీ...




కామెంట్‌లు