అబ్బాయినీ....
అమ్మాయినీ కని
పెంచి పెద్ద చేసి చదివించి
పెళ్ళి చేసేస్తాం....
మరొక ఊళ్ళో
మరొక రాష్ట్రంలో
మరొక దేశంలో
ఉద్యోగ నిమిత్తం
వెళ్ళిపోతారు పిల్లలు
ఇక్కడేమో
ఉన్న చోటనే
ఉన్న ఇంట్లోనే
డెబ్బయ్ ఏళ్ళు దాటి
ఒంటరితనపు బతుకుబండి
"ఇక్కడి అమ్మాయి చదువుకునేది!
ఇక్కడే ఆడుకునేది!
ఇక్కడే అబ్బాయి క్రికెట్ ఆడి
అద్దం పగలగొట్టిన కిటికీ అద్దం ఇదే!"
ఇలా ఏవేవో జ్ఞాపకాలు....
ఏదో తవ్వకాలలో
దొరికిన వస్తువులలా
వారిని తలుస్తూ...
ఏం వండాలి?
ఏం తినాలి?
అర గ్లాస్ అన్నం వండితేనే
అందులో ఓ గరిటెడు మిగిలిపోతోంది
ఆరోగ్య రీత్యా
వయస్సు రీత్యా
తినడాలపై తగ్గిన ఆసక్తి!
ఒంటరితనమూ,
శూన్యమూ!!
వాళ్ళున్న చోటుకి
వెళ్దాం అనుకుంటే....
ప్రయాణమే ఓ శిక్ష!!
లోయర్ బెర్త్ దొరకలేదంటే
అందరినీ అడుక్కోవాలి
చెన్నై సెంట్రల్ స్టేషన్ కి
వెళ్ళడమే ఓ యాత్రలా మారిపోయింది!
ఓలా
ఊబెర్
మనకవసరమైన సమయంలో
పీక్ అవర్ ఛార్జ్ peak hour charge
అంటూ ముక్కు పిండుతారు!
కిందా మీదా పడి
సరేకదాని వెళ్తే
సెంట్రల్ వాకిట్లోని చిన్న చిన్న మెట్లను
ఎక్కడానికీ
దిగడానికీ చేతికర్ర కావలసి వస్తుంది!
పోనీ
ఎస్కలేటర్లో వెళ్దామంటే
మనసు తటపటాయిస్తుంది
ఎస్కలేటర్లో కాలు తడబడి
పడిపోయిన వారి దృశ్యాలూ
వాట్సప్ వీడియోలూ
మనసులోకొచ్చి
భయపెడుతుంటాయి!!
అబ్బాయిని
వాట్సప్ లో పట్టుకోవాలి!
అమ్మాయిని
వీడియో కాల్లో పిలవాలి, చూడాలి!
అనుకుంటేనేమో
వాళ్ళకు టైముండదు...
అప్పుడు వాళ్ళు
ఏదో ఒక షాపింగ్ మాల్లోనో
ఏదో ఒక హోటల్లోనో
ఏదో ఒక థియేటర్లోనో
బిజీగా ఉంటారు
ఏదైనా అర్జంటా
మళ్ళా పిలుస్తాను నాన్నా
అంటారు
లేదా
ఫోన్ కాల్ కట్ చేసేస్తారు
ఒక్క మాటా లేకుండా!!
ఓ నాలుగు రోజుల తర్వాత
ఎందుకు కాల్ చేసావు నాన్నా
అంటారు!!
మేము ఎంతో ప్రేమతో
ముద్దుగా పెంచుకున్న పిల్లలు...
వాళ్ళకు పగలైనప్పుడు
మనకేమో పడుకునే టైము....
ఆప్యాయతానురాగాలను
అధిగమించి నిద్ర ముంచుకొస్తుంటుంది
మనకేమో
మనవలూ మనవరాళ్ళంటే
ముద్దూ ముచ్చటా, కానీ
వాళ్ళకేమో క్షణం తీరికుండదు
మూడేళ్ళవరకే
తాతా బామ్మా అంటూ
ఫోన్లో పలకరింపులు
ఆ తర్వాత ఫోన్లో ఎప్పుడు
పిలిచినా
వాడు బయట ఆడుకుంటున్నాడనో
వీడియో గేమ్ తో బిజీ అనో
ఎటో వెళ్ళాడనో
కొడుకు నించో కూతురు నించో జవాబు!
ఎప్పుడో పుష్కరానికన్నట్టు
క్షణం వీడియో కాల్లో
ముఖం చూపించి వెళ్ళిపోతారు
గడ్డం పెరిగిన నా ముఖం
ముడతలు పడ్డ మా ఆవిడ ముఖం
చూడటానికి గిట్టదేమో వాళ్ళకు....??
మన సంస్కృతీ
మన సంప్రదాయాలూ
తాతా బామ్మ అనే బంధాలూ
అన్నింటినీ టెక్నాలజీ మింగేసింది!
ఎంతసేపని టీవీ చూడటం
ఈ రాజకీయాలూ
ఈ సినిమాలూ
నేరాలూ ఘోరాలూ
మన బీపీని పెంచుతాయి!!
నా సొంత ఇల్లే మాకు
అనాథాశ్రమమైపోయింది!
ఏదో వాట్సప్
ఫేస్ బుక్ ఉండటంవల్ల
కాస్త పిచ్చెత్తకుండా ఉంది !
అబ్బాయీ
అమ్మాయీ
వేసే స్టేటస్ వంటివే
రోజువారీ కాలక్షేపం!
ఎలా ఉన్నారని
ఇతరులెవరో అడిగినప్పుడు
కన్న బిడ్డల గురించి
నెగటివ్ గా చెప్పలేం కదా,
మాకేమిటీ
రాజుల్లా బతుకుతున్నాం
ఆహా ఓహో అని ఉంటున్నాం
పిల్లలతోనూ
మనవళ్ళతోనూ అంటూ
ఏవేవో చెప్తాం!!
చాలా మంది
తాతయ్యలు, బామ్మల
జీవితం ఇంతే
అంత్య దశలో.....!!
ఈ స్థితిని
కొందరు చెప్పుకుంటారు!
ఎక్కువమంది చెప్పుకోరు!
అంతే తేడా....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి