ఊహా విహారం (రెవరీ)...!!:-అరుణ.గోగులమందహైదరాబాద్(ఏలూరు)

వెతక్కుండానే చుట్టుకుంది
పాదాలకుమెరుపు తీగ...!
                                                             
దేదీప్యంగా వెలుగుతున్న
స్వర్గసీమల దారిలో-
ఆ నడిరేయిలో,
మెరుపులాంటి ఓ కలా!

నమ్మలేనట్టు---
చిత్తరువై  నిలుచుండిపోయిన 
సమాధి స్థితి....
మైకం కమ్మిన ముగ్ధలా
ఆ అందగాడి వెంట, 
నడుస్తున్న  ఆశ్చర్యార్ధకం..!

పరదైసుల లోయల్లో -
కొన్ని పున్నమి రాత్రులు,
ఊపిరులూదిన వెచ్చని 
ఆవిర్ల పెనవేతలు....
చేతివేళ్ళకొసల్లో మొదలై
అరిపాదాల అంచుల వరకూ 
పాకిన మగసిరి మర్యాదలు!

ప్రణయపు సరిహద్దులదాటి
యేకమై పయనించి-
అలసిసొలసి నిదురించిన 
స్త్రీత్వపు నిట్టూర్పులు..!

ఉలికిపాటుల సడితో..
చెదరిన కల.....
రంగులద్దని----
అసంపూర్తి చిత్రంలా..
కట్టెదుట.....
శూన్య ప్రహేళిక.....!

అల్లుకున్న చేతివేళ్ళను
మెల్లగా విదిలించి,
ఓ గంధర్వుడు -
మాయమైన చప్పుడు..
వెచ్చదనం వెలువరిస్తూ,
చీకట్లోకి..ఆతని అడుగు జాడలు..!

భళ్ళున బద్దలైన గుండె శకలాలపై
కర్కశంగా..
నడచిపోయిన గురుతులు...
తెరచిఉన్న తలుపుపై స్రవించిన
జటామాంసి సువాసనలు.....!

లోపల గదిలో..
వెర్రిగా వెతుకుతున్న కన్నుల్లో..
పారదర్శక గాజుఫలకం
ఘనీభవించిన అశ్రు కెరటం.!
మరణించకపూర్వం..
ద్రవించిన మనసు విడిచిన..
గుప్పెడు..కన్నీటి చుక్కలు,...!!