కాపాడిన పుస్తకాలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445


  అది 1970 వ సంవత్సరం.చలపతి డిగ్రీ పూర్తి చేసాడు.చలపతికి గ్రంథ ప్రేమ మెండు!

      "ఇక ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వరా"చెప్పాడు చలపతి నాన్న విశ్వనాథం.

       "నాన్నా, ఏమీ అనుకోకు నాకు పుస్తకాలంటే ఎంతో ఇష్టం కదా,అందుకని ఓ పుస్తకాల షాపు పెడతాను,అందులో ఇప్పుడు పబ్లిష్ అయ్యే పుస్తకాలే కాదు అతి పాత పుస్తకాలు కూడా సేకరించి ఔత్సాహికులకు అమ్ముతాను"చెప్పాడు చలపతి.

       "అరేయ్,నామాటవిను  పుస్తకాల షాపు కుటుంబాన్ని ఏం పోషిస్తుంది? ఉద్యోగం చూసుకో ఏ కష్టం లేకుండా నెలకింత వచ్చి పడుతుంది"

         "నాన్నా పుస్తకాల షాపు పెట్టి మంచి పుస్తకాలు అమ్మడం నా జీవితకల"నిక్కచ్చిగా చెప్పాడు చలపతి.

        "సరే నేను చెప్పాల్సింది చెప్పాను...ఇక నీ ఇష్టం"

        "నాన్నా ప్రయత్నించి కలలు నిజం చేసుకోవడంలో తప్పులేదు కదా!మరీ అంత ఇబ్బంది వస్తే అప్పుడు నీవు చెప్పినట్టు చేస్తాను"చెప్పాడు చలపతి.

      "నీ కల నెరవేరాలని కోరుకుంటున్నాను"థమ్స్ అప్ చూపించి చెప్పాడు విశ్వనాథం.

                   ***************

     అనేక ప్రయత్నాలు చేసి బ్యాంక్ లోన్ తీసుకుని చలపతి మెయిన్ రోడ్ లో ఓ చిన్న షాపు తెరచి దానికి 'వాగ్ధేవి పుస్తక ప్రపంచం' అనే మంచి పేరు పెట్టాడు,అధ్బుత పుస్తకాలు తెప్పించి అమ్మకానికి పెట్టాడు.మెల్లగా మిత్రుల సహాయంతో పాత పుస్తకాలు సేకరించి అమ్మసాగాడు.ఆ విధంగా పాతపుస్తకాలు కొని అమ్ముతాడనే మంచి పేరు చలపతికి వచ్చింది.

       ఒకరోజు ఓ ఎనభై ఏళ్ళ వృద్ధుడు ఆటోలో భారంగా దిగి ఆటో డ్రైవర్ సహాయంతో పది పాత పుస్తకాలున్న పెట్టెను తెచ్చి చలపతికిచ్చి కొనమని అడిగాడు.

        చూస్తే అవి 1922 లో ముద్రితమైన అప్పటి రచయితలు వ్రాసిన మొదటి ముద్రణ పుస్తకాలు! అయినా అవి చిరిగి పోకుండా జాగ్రత్తగానే ఉన్నాయి.

    "బాబూ మేము పెద్దవాళ్ళ మయిపోయాము ఉన్న ఒక్క కొడుకు జర్మనీలో స్థిరపడి పోయాడు.వాడికి వాడి భార్యకు పుస్తకాల మీద ఇంట్రస్ట్ లేదు,అందుకే అమ్మేద్దామనుకుంటున్నాను" మెల్లగా చెప్పాడు ఆయన.

          ఆ పాతపుస్తకాలను జాగ్రత్తగా పరిశీలించి, "అయ్యా,నిజానికి ఇవి మంచి పుస్తకాలు అమ్ముడు పోవాలంటే చాలా నెలలు వేచి చూడాలి,అందుకే వీటికి ఐదు వేలు ఇస్తాను" చెప్పాడు చలపతి.

        ముసలాయన ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు చలపతి.ఆనందంతో ముసలాయన ఎన్నో కృతజ్ఞతలు చెప్పాడు.డబ్బు ఇచ్చాక చలపతి ఆయన అడ్రస్ నోట్ చేసుకుని,ఆయనే అమ్మినట్టు ఓ సంతకం ఆయన వద్ద తీసుకున్నాడు.పాత పుస్తకాలు కొన్నప్పుడు చలపతి ఈపద్దతి పాటిస్తున్నాడు.

         అలా ఆ మంచి పుస్తకాలు చలపతి షాపులో చేరి పోయాయి.

         ఓ పది నెలల తరువాత పాతపుస్తకాలు సేకరించే జగదీష్ అనే డబ్బుగల ఆయనకు చలపతి షాపు సంగతి తెలిసింది.ఆయన వచ్చి బోలెడు పాత పుస్తకాలు పరిశీలించి ఆఖరికి ఆముసలాయన ఇచ్చిన పుస్తకాలు చూసి ఆశ్చర్య పోయాడు.పది పుస్తకాలను పరిశీలించి వాటికి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు.ఆ మాట వినేసరికి చలపతి గుండె ఆనంద డోలికల్లో మునిగింది.

       ఆ పదే కాకుండా మరికొన్ని పాత పుస్తకాలను జగదీష్ కి చలపతి అమ్మాడు!

        మంచిలాభంతో ఇంటికి వచ్చిన చలపతిని చూసి విశ్వనాథం ఆశ్చర్య పోయి,"పుస్తకాల షాపు పెట్టి మంచి పని చేశావు,అందులో పాతపుస్తకాలు సేకరించి మరీ మంచిపని చేశావు,నీకు అంతా మేలు జరుగుతుంది"అని ఆశీర్వదించాడు.

        రెండోరోజు మరో పదివేలు తీసికెళ్ళి ఆ పుస్తకాలు అమ్మిన పెద్దాయనకు ఇచ్చాడు.ఆయన ఎంతో ఆనందంతో డబ్బుతీసుకుని ఆశీర్వదించి పంపాడు.

                    


కామెంట్‌లు