మేలు చేసే గ్రీన్ టీ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ టీ ఉపయోగం బాగా పెరిగి పోయింది!ఎందుకంటే ఇది ఆరోగ్య ప్రధాయిని. మీరు జపాన్ కి వెళ్ళినా చైనా కి వెళ్ళినా  గ్రీన్ టీ త్రాగేవారు అక్కడ చాలా ఎక్కువ.మనదేశంలో కూడా ఇప్పడు అనేకమంది ఈ గ్రీన్ టీని సేవిస్తున్నారు.
         గ్రీన్ టీ తయారు చేయడం చాలా సులభం. మార్కెట్ లో గ్రీన్ టీ డిప్ బ్యాగ్లు దొరుకుతాయి లేక విడిగా గ్రీన్ టీ పొడి అమ్ముతారు. నీటిని మరగబెట్టి తగిన మోతాదులో గ్రీన్ టీ బ్యాగ్ ఉన్న కప్పులో పోసి మూడు నిముషాలు ఉంచితే దాని సారం తయారు అవుతుంది దీనిని త్రాగితే అదే గ్రీన్ టీ త్రాగడం , కానీ ఇది కొంత వగరుగా ఉంటుంది.కొందరు ఒక అరస్పూన్ తేనె కలుపు కుంటారు.కానీ చక్కెర కలుప కూడదు.ఇదే విధంగా విడి గ్రీన్ టీ పొడి వేసుకుని తయారు చేసుకోవచ్చు.
        చైనాలో గ్రీన్ టీ రోజుకు నాలుగు లేక ఐదు కప్పుల టీ త్రాగే పదివేల మంది మీద చేసిన పరిశోధనల వలన గ్రీన్ త్రాగే వీరిలోగుండె జబ్బులు,కాన్సర్ రోగాలు లేకుండా ఎక్కువకాలం బతికినట్టు తెలుసుకున్నారు.ఇది జీవిత కాలాన్ని పెంచుతుంది.
          తరవాత జరిగిన పరిశోధనల్లో గ్రీన్ టీ సేవనం వలన మరిన్ని ఆరోగ్య లాభాలు ఉన్నట్లు తెలుసుకున్నారు.మెదడు పనితీరు మెరుగు పరుస్తున్నట్టు.మతిమరపు(ఆల్జిమర్స్) రాకుండా కాపాడుతున్నట్లు తెలుసుకున్నారు.దీనికి కారణం దీనిలో ఆరోగ్యాన్ని కాపాడే ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే!అనవసరమైన కొవ్వు కరగించి బరువు పెరగకుండా చేస్తుంది.
        క్రమం తప్పకుండా గ్రీన్ టీ సేవిస్తే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.ముఖ్యంగా సూర్యరశ్మి లో ఉండే అతినీల లోహిత కిరణాల(ultra violet rays) నుండి కాపాడి చర్మ కాన్సర్ భారీన పడకుండా చేస్తుంది.
        శరీరంలో హాని చేసే కొవ్వు(LDL)ను తగ్గించి గుండె ఆరోగ్యం కాపాడుతుంది.శరీరంలో పెరిగిన చక్కెర స్థాయిలను తగ్గించి టైప్ 2మధుమేహాన్ని అదుపు చేస్తున్నట్టు కనుగొన్నారు.
        రోజూ గ్రీన్ టీ  త్రాగితే శరీరంలో నైట్రిక్ ఆసిడ్ పెరిగి రక్త నాళాల ఆరోగ్యం కాపాడుతుందనే పరిశోధన 2004లో 'ఆర్చివ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసన్'  అనే వైద్యపత్రికలో ప్రచురింపబడింది.
      గ్రీన్ టీ శరీరం అలసి పోకుండా చేస్తుంది అంటే పని చేయడానికి శక్తి పెంచుతుంది!టోక్యో, ఆస్ట్రేలియా లలో జరిగిన పరిశోధనల్లో  ఎముకలు త్వరగా అరిగి పోకుండా కాపాడుతుందని తెలుసుకున్నారు.ఇది నోటి ఆరోగ్యానికి కూడా మంచిది. చిగుళ్ళను కాపాడుతుంది,నోటి దుర్వాసన పోగొడుతుంది.లివర్ ను కూడా కాపాడుతున్నట్లు తెలుసుకున్నారు.
       దీనిలో పుష్కలంగా ఉన్న ఆంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరం రోగాల భారీన పడకుండా కాపాడుతుంది.
          ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్న గ్రీన్ టీ త్రాగి ఆరోగ్యాన్ని కాపాడుకోండి దీనిని క్రమం తప్పకుండా సేవిస్తే బోలెడు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి.మరి ఈరోజే గ్రీన్ టీ త్రాగడం మొదలు పెట్టండి.
              *****************
           మీకు తెలుసా?
   మైక్రోవేవ్ ఓవెన్ లో తయారయిన మొదటి ఆహార పదార్థం పాప్ కార్న్1945లో!
              *****************

కామెంట్‌లు