మంచి ఆలోచన:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 రామచంద్రకు భక్తి ఎక్కువ, ప్రతి రోజు పూజ నిష్టగా చేయడం,ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్ళి హుండీలో డబ్బులు వేసి కొంతసేపు గుడిలో కూర్చుని వచ్చేవాడు.
       ఒక శని వారం గుడికి రామచంద్ర  తన కూతురు కమలతో గుడికి బయలుదేరాడు.అది చలి కాలం వాతావరణం చల్లగా ఉంది.
         అలా కొంత దూరం వెళ్ళే సరికి ఓ చెట్టు కింద ఒక వృద్ధుడు చినిగిన బట్టలతో వణుకుతున్నాడు.
ఆ వృద్ధుడి బాధను కమల చూసి,"నాన్నా, ఆ తాత చలిలో వణకుతున్నాడు.పాపం దుప్పటికూడాలేదు"అని బాధగా చెప్పింది.
        రామచంద్రకూడా ఆ వృద్ధుణ్ణి చూసి చలించాడు.అతనికి స్వెట్టరో,దుప్పటో ఇస్తే బాగుంటుందని అనుకొన్నాడు.కానీ తనుదుప్పటి కొనేంత డబ్బు తీసుక రాలేదు.కేవలం దేవుడి హుండీలో వేసేందుకు ఏభైరూపాయలు,ఇంటికి సబ్బులు కొనేందు మరొక ఏభై రూపాయలు తనవద్ద ఉన్నాయి.అంటే తన వద్ద వంద రూపాయలు ఉన్నాయి.
       రామచంద్ర ఇక ఆలోచించలేదు.గబగబా గుడి పక్కన ఉన్న బట్టల షాపుకెళ్ళి ఓ దుప్పటి ఎంత అవుతుందో అడిగాడు.
       "సార్ నాదగ్గర ఒక దుక్క దుప్పటి ఉంది,కాని దానికి రెండు చిన్న చిల్లులు ఉన్నాయి,మీకు నచ్చితే దానిని ఎనభై రూపాయలకే ఇస్తాను"అని చెప్పి దుప్పటి చూపించాడు.
      రామచంద్ర ఇక బేరం చేయకుండా ఆ దుప్పటి ఎనభై రూపాయలకు కొన్నాడు. మంచి ఆలోచన ఉంటే పైవాడు తప్పక దారి చూపిస్తాడు. పక్కనే ఉన్న టైలర్ వద్ద రెండచిల్లుల్ని కుట్టించి తీసుకవెళ్ళి  ఆదుప్పటిని  వృద్ధుడికి ఇచ్చాడు,అతని కళ్ళలో కోటి వెలుగులు కనబడ్డాయి.
        వృద్ధుడు రామచంద్రకు,కమలకు వారి మంచి తనానికి కృతజ్తలు చెప్పాడు.వృద్ధడు పక్కన ఉన్న చెట్టు మీద కోతి సంతోషంతో కిచ కిచ లాడింది.
        రామచంద్ర,కమల గుడికి వెళ్ళి హనుమంతుడి హుండీలో తగిన డబ్బు వేయలేక పోయేసరికి క్షమంచమని అడిగారు.అయినా ఆంజనేయుడు తృప్తిగా దీవిస్తున్నట్టు కనబడ్డాడు.
       ఆ రాత్రి రామచంద్రకి కలలో హనుమంతుడు కనబడి "నీవు ఆవృద్ధుడికి చేసిన సహాయమే నా హుండీకి నీవు ఇచ్చిన డబ్బు,నీకు ఆ రాముడు మేలు చేస్తాడు"అని దీవించాడు.
           రామచంద్ర ఎదరు గోడమీద ఉన్న ఆంజనేయుడి పటానికి దణ్ణం పెట్టి తృప్తిగా నిద్ర పోయాడు.
                   **************
        ఎవరూ గమనించకపోయినా నీ పని నీవు సక్రమంగా చెయ్యి.అదే చిత్తసుద్ధి.
                      *************

కామెంట్‌లు