*పిచ్చిరాజు (జానపద హాస్య కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు - 9441032212

  ఒకప్పుడు మనదేశంలో 'గుండురాజ్యం' అని ఒక రాజ్యముండేది. దాన్ని పాలించే రాజు పెద్ద తిక్కలోడు. తాను ఏమి చెప్తే అందరూ అదే చేయాలని అనేటోడు. కాదన్నా, ఎదిరించినా వాళ్ళని పట్టుకోనొచ్చి కాళ్ళో, చేతులో తీయించేటోడు. దాంతో జనాలంతా భయపడి ఎన్ని బాధలనుభవిస్తా వున్నా నోరు తెరవక గమ్మునుండేటోళ్ళు.
ఆ రాజుకు అందమైన జుట్టుండేది. ఆ జుట్టంటే రాజుకు చానా చానా ఇష్టం. ఒకసారి తనకు తప్ప ఎవరికీ జుట్టు వుండగూడదు అనుకున్నాడు. వెంటనే సైనికులను పిలిపించి రాజ్యంలో అందరూ గుండు కొట్టించుకోవాలనీ, ఎవరయినా జుట్టుతో కనబడితే అక్కడికక్కడే గుండు చేయించడంతో పాటు వంద కొరడా దెబ్బలు కూడా తప్పవని వీధివీధిన దండోరా వేయించినాడు. అంతే జనాలంతా భయపడిపోయి ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసిలోళ్ళు, పిల్లోళ్ళు అనే తేడా లేకుండా అందరూ నున్నగా గుండు కొట్టించేసుకున్నారు. అందువల్లనే ఆ రాజ్యానికి ఆ పేరు వచ్చింది.
ఒకసారి రాజుకి వేటకి పోవాలనిపించింది. వెంటనే మంత్రిని పిలిచి “నీవు రాజ్యాన్ని చూసుకుంటా వుండు. నేను అడవిలోకి పోయి జంతువులను వేటాడొస్తా" అన్నాడు. మంత్రి 'సరే' అన్నాడు. రాజు వెయ్యిమంది సైనికులను వెంటేసుకొని వేటకు వెళ్ళినాడు. వాళ్ళు పోయినేది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా అడవి కాదు. చానా చానా పెద్దది. యాడ చూసినా పులులు, సింహాలూ, ఎలుగుబంట్లు, ఏనుగులూ కనబడసాగినాయి. వాటిని చూసి రాజు భయంతో వణికిపోయినాడు.
"ఓరినాయనోయ్... మరీ ఇంత పెద్ద జంతువులా... దాండ్లను నేను పట్టుకోవడం సంగతేమోగానీ, వాటికి నేను దొరక్కుంటే చాలు" అనుకోని “రేయ్... ఇంత పెద్ద పెద్ద జంతువులు వద్దు గానీ... ఏవయినా చిన్నచిన్న జంతువులుంటే చూడండి. వేటాడుదాం" అన్నాడు.
సైనికులు 'సరే' అని వెదుకుతా వుంటే వాళ్ళకి ఒకచోట ఒక చిన్న ఎలుక కనబడింది. వెంటనే వాళ్ళు గట్టిగా “రాజా... రాజా... భయంకరమైన ఎలుకమృగం పారిపోతా వుంది. రండి. వేటాడుదాం" అని అరిచినారు. వెంటనే రాజు ఒక పెద్ద కత్తి తీసుకోని, సైనికులతో దాని వెంట పడినాడు. ఆ అరుపులకి, కేకలకి భయపడిన ఆ ఎలుక చించుకోని వురకసాగింది. అట్లా వురుకుతా... వురుకుతా... అది ఒక పెద్ద కొండ కింద వున్న ఒక చిన్న కన్నంలోనికి దూరింది. రాజు ఆయాసపడతా సైనికులతో ఆడికి చేరుకున్నాడు.
“రాజా... మీ దెబ్బకి భయపడి ఆ ఎలుకమృగం పారిపోయి ఆ కన్నంలో దాక్కుంది" అన్నాడు ఒక సైనికుడు. 
“యాడికి పోతాదో నేనూ చూస్తా... ఈ రోజుతో అదో నేనో తేలిపోవాల" అంటూ రాజు మీసం దువ్వి కత్తి పట్టుకోని ఆ కలుగు పక్కనే కూచున్నాడు. రాజుతోపాటు సైనికులందరూ కత్తులూ, బళ్ళాలూ పట్టుకోని కాపలా కాయసాగినారు. ఒక రోజంతా గడిచింది గానీ ఎలుక మాత్రం భయంతో బైటకు రాలేదు.
దాంతో రాజుకి ఇంకా పట్టుదల పెరిగిపోయింది. వెంటనే రాజ్యం నుండి మరో వెయ్యిమంది సైనికులను పిలిపించినాడు. పెద్ద పెద్ద వలలు తెప్పించి ఎలుక ఎటూ పారిపోకుండా కొండ చుట్టూ కట్టించినాడు. సైనికులను వల బైట అడుగుకొక్కని చొప్పున కత్తులతో కాపలా పెట్టించినాడు. కూలీలను పిలిపించి కొండను తవ్వమన్నాడు. వాళ్ళు ఏడు పగళ్ళు, ఏడు రాత్రుళ్ళు కష్టపడి తవ్వేసరికి ఎలుక బైటపడింది. అది పారిపోతావుంటే సైనికులు వలలేసి ఆఖరికి దాన్ని పట్టుకున్నారు.
వెంటనే రాజు దాని నాలుగు కాళ్ళు కట్టేసి, అందరికీ కనబడేలా ఒక ఎత్తయిన స్తంభం మీద పెట్టి, మేళతాళాలతో రాజ్యమంతా తిరగసాగినాడు. అది చూసి జనాలకు ఒకవైపు నవ్వు వస్తావున్నా... ఏమంటే ఏమవుతుందో అనే భయంతో "జై మహారాజా... జైజై మహారాజా" అంటూ వీధులకు రెండు వైపులా నిలబడి పూలు చల్లుతా అరవసాగినారు.
ఆ చప్పుళ్ళకు, అరుపులకు ఎలుక బాగా బెదిరిపోయింది. ఎట్లాగయినా తప్పించుకోవాలని కాళ్ళకు కట్టిన తాళ్ళను కొంచం కొంచం కొరకసాగింది. అట్లా కొరుకుతావుంటే అవి కొంచం కొంచం తెగుతా తెగుతా అఖరికి అన్నీ వూడిపోయినాయి. అంతే... అది ఒక్కుదుటున పైనుండి కిందకు దుంకి జనాల కాళ్ళ మధ్య దూరి వురకసాగింది. అది చూసి రాజు, సైనికులు మళ్ళా దాని వెంట పడినారు. అది అట్లా వురుకుతా... వురుకుతా... ఒక గుడిసెలోకి దూరింది. సైనికులు చుట్టుముట్టుకొని ఎంత వెదికినా దొరకలేదు.
దాంతో రాజుకు చానా కోపమొచ్చింది. వెంటనే ఒక కాగడా తీసుకోని గుడిసెకు అంటించినాడు. ఆ గుడిసె చుట్టూ చానా గుడిసెలున్నాయి. దాంతో మంటలు మిగతా గుడిసెలకు గూడా పాకినాయి. అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీచడంతో మంటలు ఇంకా పెద్దగయి చుట్టూ వున్న ఇళ్ళకు, మిద్దెలకు గూడా పాకినాయి. అట్లా కొద్ది గంటల్లోనే రాజ్యం మొత్తం అంటుకోనింది. జనాలంతా బావుల్లోంచి నీళ్ళు తెచ్చి పోస్తా వున్నారు గానీ మంటలు కొంచం గూడా ఆరడం లేదు.
దాంతో... రాజు సైనికులను పిలిచి "రేయ్... వూరినానుకొని పెద్ద చెరువుంది గదా... పోండి... పోయి దాని కట్ట తెగ్గొట్టండి. నీళ్ళన్నీ వూర్లోకొచ్చి అంతా ఆరిపోతుంది" అని పంపించినాడు. కానీ ఆ చెరువు మామూలు చెరువు కాదు. దాన్నిండా మొసళ్ళు, విషపు పాములు వున్నాయి. జనాలు పొరపాటున గూడా ఆ చెరువు వంకపోరు. అటువంటిది సైనికులు పోయి కట్ట తెగ్గొట్టగానే నీళ్ళు... దాంతోపాటు మొసళ్ళు, పాములు పూర్లోకి వచ్చేసినాయి. ప్రజలకు ఏం చేయాల్నో అర్థం కాలేదు. ఒక పక్క మంటలు, మరొకపక్క మొసళ్ళు. దిక్కుతోచక అల్లాడసాగినారు. చానా మంది చనిపోయినారు. చానా వరకు ఇళ్ళన్నీ కాలిపోయినాయి.
రాజు చేసే తిక్క పనులన్నీ చూసీ చూసీ ఆ వూరి మంగలాయనకు చానా కోపమొచ్చింది. అందరికీ గుండే కావడంతో పెద్దగా పనీ దొరకడం లేదు. డబ్బులు రావడం లేదు. దాంతో పాటు చెరువు నీళ్ళ దెబ్బకి వున్న కొట్టం కాస్తా కొట్టుకోనిపోయింది. దాంతో వేరే దారి లేక ఆ వూరొదిలి వేరే చోటికి పోవాలని అనుకున్నాడు. పోయే ముందు ఎట్లాగయినా ఆ తిక్కరాజుకు తగిన శాస్తి చేయాలని అనుకున్నాడు.
ఆరోజు అర్ధరాత్రి అందరూ పండుకున్నాక మంగలాయన కత్తి తీసుకోని రాజభవనంలోనికి చప్పుడు కాకుండా పిల్లిలెక్క దూరినాడు. ఒకొక్క గదే దాటుకుంటా... దాటుకుంటా.... ఆఖరికి రాజుండే గదికి చేరుకున్నాడు. రాజు మంచమ్మీద పడి హాయిగా గురకలు పెడ్తా వున్నాడు. మంగలాయన మట్టసంగా చప్పుడు కాకుండా రాజు కాడికి పోయి కత్తి తీసి నిద్ర చెడకుండా నున్నగా గుండు గీసి, మీసాలు కూడా తీసేసి అన్నించి వచ్చిందారిన వచ్చినట్టు వెళ్ళిపోయినాడు.
పొద్దున్నే తిక్కరాజు లేచి వేపపుల్లతో పళ్ళు తోముకుంటా అద్దంలో చూసుకున్నాడు. అందులో నున్నని గుండు జుట్టు, మీసాలు లేకుండా కనబడింది. వెంటనే రాజు అదిరిపడి “అరెరే. ఎవడో రాత్రికి రాత్రి నా తల తీసేసి వేరే వాళ్ళ తల పెట్టినట్టున్నాడు" అనుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిపించి “నా తల ఎవడో ఎత్తుకుపోయినాడు. వెంటనే సైనికులను దేశమంతా మూలమూలకు పంపించి వెదికించండి. వారంలోగా నా తల నాకు తిరిగి తేకపోతే మీ అందరి తలలు తీయించేస్తాను" అని బెదిరించినాడు.
మంత్రికి ఏం చేయాల్నో అర్ధం కాలేదు. ఈ తిక్కలోడు ఒక్కమాట అన్నాడంటే ఖచ్చితంగా చేసి తీరతాడు. వీనికి అసలు విషయం చెప్పినా కొంచం గూడా అర్థం కాదు. ఇక వీన్తో లాభం లేదు. ఎట్లాగయినా సరే ఈ రాజ్యానికి వీని పీడ తొలగించాల్సిందే అనుకున్నాడు. దాంతో ఒక బొమ్మలు చేసే వాని దగ్గరికి పోయి అచ్చం రాజు తలమాదిరే వుండేటట్లు ఒక బొమ్మ తల చేయించి రాజు దగ్గరికి తీసుకొని వచ్చినాడు.
రాజు అది చూసి సంతోషించి "వెంటనే ఈ గుండు తల తీసేసి నా తల నాకు పెట్టండి" అంటూ కత్తి తీసుకొని తన తల తానే నరుక్కుని చచ్చిపోయినాడు. ఆ తిక్కరాజు పీడ తొలగిపోయినందుకు ఆ వూరి జనాలంతా సంతోషించి సంబరాలు చేసుకున్నారు.

కామెంట్‌లు